భవిష్యత్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో కలుస్తుంది: వైమానిక దళ సీనియర్ అధికారి

By telugu team  |  First Published Oct 27, 2021, 6:41 PM IST

జమ్ము కశ్మీర్ అంశం ఎప్పటికీ సున్నితమైనదే. తాజాగా, కశ్మీర్‌పై వైమానికదళ టాప్ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు భారత్ కచ్చితంగా సంపూర్ణ కశ్మీర్‌ను సాధించి తీరుతుందని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనపరుచుకుంటుందని తెలిపారు. దీనికోసం ప్రస్తుతం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? అని అడగ్గా ఇప్పుడైతే అలాంటి ప్రణాళికలు లేవని, కానీ, కచ్చితంగా ఏదో ఒక రోజు భారత్ సంపూర్ణ కశ్మీర్‌ను కలిగి ఉంటుందని తెలిపారు.
 


శ్రీనగర్: వైమానిక దళానికి చెందిన టాప్ అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. Jammu Kashmirపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏదో ఒక రోజు India కచ్చితంగా సంపూర్ణ కశ్మీర్‌ను పొందుతుందని అన్నారు.అయితే, ఇప్పుడు Pak Occupied Kashmirను ఆక్రమించే ప్రణాళికలేమీ లేవని వివరించారు.

భారత బలగాలు బుడ్గాంలో అడుగుపెట్టి 75ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ వేడుకలో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలను పాకిస్తానీలు సరిగా చూసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.

WATCH: Western Air Commander Air Marshal Amit Dev says Pakistan-Occupied-Kashmir will join India in the years to come.

Details: https://t.co/Laf1LB9qMW pic.twitter.com/LdQQ9cpTqd

— Asianet Newsable (@AsianetNewsEN)

Latest Videos

జమ్ము కశ్మీర్‌పై Pakistan ట్రైబల్ దాడుల నేపథ్యంలో అప్పటి సంస్థానాధీశుడు మహారాజ హరిసింగ్ భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం తర్వాత 1947లో అక్టోబర్ 27న భారత బలగాలు కశ్మీర్‌లో అడుగుపెట్టాయి. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఆ పోరాటం అర్ధంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ మాట్లాడారు.

Also Read: పాకిస్తాన్‌తో చర్చలే దానికి పరిష్కారం.. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం

ఆ రోజు భారత వైమానిక దళం, ఆర్మీ బలగాలు కశ్మీర్‌లో అడుగుపెట్టి పోరాడినందుకు ఈ కశ్మీర్ ప్రాంతం స్వేచ్ఛను పొందిందని వివరించారు. ఏదో ఒక రోజు కచ్చితంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ కూడా ఈ స్వేచ్ఛాయుత కశ్మీర్‌లో కలిసిపోతుందని తాను కచ్చితంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరాల్లో భారత్ సంపూర్ణ కశ్మీర్‌ను కలిగి ఉండి తీరుతుందని వివరించారు. కాగా, సంపూర్ణ కశ్మీర్ కోసం.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడేమైనా ప్లాన్స్ ఉన్నాయా? అని కొందరు ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ ఇప్పటికైతే అలాంటి ప్రణాళికలేవీ లేవని వివరించారు.

కశ్మీర్ అంతా ఒకటి. దేశం ఒకటి. ఇరువైపులా ఉన్న ప్రజల్లో ఒకే అటాచ్‌మెంట్ ఉన్నది. ఇవాళ లేదా రేపు.. చరిత్రలోనూ ఎన్నో దేశాలు కలిసిపోయిన ఉదంతాలున్నాయి. ప్రస్తుతానికైతే సంపూర్ణ కశ్మీర్ కోసం తమ దగ్గర ప్రణాళికలేవీ లేవని వివరించిన ఆయన.. అది దైవేచ్ఛ అని తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలను సరిగా చూడటం లేదని వివరించారు. ఒకవేళ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇప్పటికే సంపూర్ణ కశ్మీర్‌ భారత్ అంతర్భాగంగా ఉండేదని అన్నారు. 

Also Read: జమ్మూకాశ్మీర్: ఓ పక్క అమిత్ షా పర్యటన.. కాల్పులకు తెగబడ్డ ముష్కరులు, ఓ పౌరుడు మృతి

టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అందుకు తగినట్టుగా వైమానిక దళమూ అప్‌డేట్ కావాలని ఎయిర్ మార్షల్ అమిత్ దేవ్ వివరించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి అదే రీతిలో బలమైన మిలిటరీ అవసరమని తెలిపారు. ఈ బాధ్యతను తాము నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో వైమానిక దళం మరింత బలోపేతమవుతుందని, తమపై ఉన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు.

డ్రోన్ దాడుల గురించి అడగ్గా.. వాటితో పెద్దగా భయపడాల్సిన పని లేదని వివరించారు. వాటిని ఎదుర్కొనే వ్యవస్థ సిద్ధంగా ఉన్నదని, ఇప్పుడిప్పుడే వాటిని అమలు చేస్తున్నామని తెలిపారు. డ్రోన్ దాడులతో నష్టం స్వల్పమేనని వివరించారు. 

click me!