
Prime Minister Narendra Modi: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. డిజిటల్ విప్లవ ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా భారీ, ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ నెంబర్ (జామ్) వల్ల కోట్లాది మంది పేదల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయం అందించడం సాధ్యమైందన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో ట్రేసింగ్, వ్యాక్సినేషన్లో టెక్నాలజీ మెరుగైన ప్రభావం చూపిందనీ, ఆరోగ్య సేతు, కోవిన్ యాప్ ఎంతగానో దోహదపడ్డాయని చెప్పారు.
బడ్జెట్ అనంతర వెబినార్ లో 'టెక్నాలజీని ఉపయోగించి ఈజ్ ఆఫ్ లివింగ్' అనే అంశంపై జరిగిన వెబినార్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. చిన్న వ్యాపారాల సమ్మతి వ్యయాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటోందనీ, తగ్గించగల సంబంధిత జాబితాను రూపొందించాలని పరిశ్రమలను కోరారు. 'చిన్న వ్యాపారాల సమ్మతి వ్యయాన్ని తగ్గించాలనుకుంటున్నాం. మీరు (పరిశ్రమ) తగ్గించగల అనవసరమైన సమ్మతి జాబితాను రూపొందించండి.. వానిటి క్లియర్ చేస్తాం' అని మోడీ తెలిపారు. భారతదేశం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టిస్తోందనీ, డిజిటల్ విప్లవ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి పన్ను వ్యవస్థను ముఖరహితంగా మార్చడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. పన్ను వ్యవస్థను ముఖరహితంగా మార్చడానికి, పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామనీ, భారతీయ పౌరుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు. 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు చర్చలకు దారితీస్తోందనీ, వైద్యం, విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
కృత్రిమ మేధను ఉపయోగించి పరిష్కరించగల సామాన్యులు ఎదుర్కొంటున్న 10 సమస్యాత్మక అంశాలను గుర్తించాలని కోరారు. టెక్నాలజీ వన్ నేషన్ వన్ రేషన్ కు పునాది వేసిందనీ, జామ్ (జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ నంబర్) మూడు అంశాల త్రయం పేదలకు ప్రయోజనాలను అందించడంలో సహాయపడిందని ఆయన అన్నారు. 21వ శతాబ్దం టెక్నాలజీ ఆధారితమైందని పేర్కొంటూ దీన్ని కేవలం డిజిటల్, ఇంటర్నెట్ టెక్నాలజీకి మాత్రమే పరిమితం చేయలేమని స్పష్టం చేశారు.
అలాగే, 'జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్' అనేది మన ప్రాధాన్యాంశంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. మన క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని, అందుకు టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఉత్పత్తిలో చాలా ఫినిషింగ్ వేలో ఉత్పత్తులను తీసుకురాగలమనీ, అప్పుడే ప్రపంచ మార్కెట్ ను మనం ఆక్రమించుకోగలమని తెలిపారు.