
సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ సోమవారం ఎయిర్ ఇండియా విమానంలో సర్వ్ చేసిన భోజనంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాగ్‌పూర్ నుండి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో వడ్డించిన ఆహారం పట్ల అసంతృప్తిగా ఉన్నానని తెలుపుతూ చెఫ్ సంజీవ్ కపూర్.. ఈ మేరకు భోజనం మీద ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. తనకు పుచ్చకాయతో కూడిన కోల్డ్ చికెన్ టిక్కా, దోసకాయ, మినిస్క్యూల్ ఫిల్లింగ్‌తో కూడిన శాండ్‌విచ్, షుగర్ సిరప్ డెజర్ట్ అందించారని చెఫ్ ఆరోపించాడు.
భోజనానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, ''వేక్ అప్ @airindiain. నాగ్‌పూర్-ముంబై 0740 విమానం. పుచ్చకాయ, దోసకాయ, టొమాటో, సెవ్ వేసిన కోల్డ్ చికెన్ టిక్కా, సన్నగా తరిగిన క్యాబేజీ, మాయో కూరిన శాండ్‌విచ్, స్వీటెడ్ క్రీమ్, ఎల్లో గ్లేజ్‌తో పెయింట్ చేసిన షుగర్ సిరప్ స్పాంజ్'' అని మొదటి ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక రెండో ట్వీట్‌లో, ''నిజంగా !!! భారతీయులు అల్పాహారంగా తినవలసినది ఇదేనా?'' అని ప్రశ్నించారు. దీన్ని ఎయిర్ ఇండియాకు ట్యాగ్ చేశారు.
సంజీవ్ కపూర్ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత, ఎయిర్ ఇండియా ఈ ట్వీట్‌పై స్పందించింది. ''సార్, మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యమైనది. మేం మా సేవలను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తున్నాం. రేపటి నుండి ఈ సేవల్లో మా భాగస్వాములైన తాజ్ సాట్స్, అంబాసిడర్ ద్వారా అందించబడుతుంది. ఆన్‌బోర్డ్ ఫుడ్‌తో మీకు మంచి అనుభవం ఉంటుందని నమ్మండి!'' అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ చాలా మంది ట్విటర్ వినియోగదారులకు కోపం తెప్పించింది.
ఒక కస్టమర్ ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ, ''మీరు చెప్పేది విచిత్రంగా ఉంది. వింత కాంబోలతో చల్లని ఆహారాన్ని అందిస్తున్నారు. టాటా గ్రూప్ దీనిని పరిశీలించి మెరుగుపరుస్తుందా.. విమానంలో ఆహారం ఎప్పుడూ బుక్ చేయవద్దు. ప్రయాణానికి ముందు లేదా తర్వాత తినండి. కనీసం వేడి, ఆరోగ్యకరమైన భోజనం తినవచ్చు. విమానంలో కాఫీ/టీ కూడా భయంకరంగా ఉంటుంది. నీరు కూడా చల్లగా ఇస్తారు... నేను నా స్వంత ఫ్లాస్క్‌ని తీసుకువెడతాను. చెక్-ఇన్ తర్వాత వాటర్ కియోస్క్‌ల వద్ద నీటిని నింపుకుంటాను. అని రాసుకొచ్చారు.
గత నెలలో ఓ మహిళ తనకు వడ్డించిన భోజనంలో రాయి కనిపించిందని ఫిర్యాదు చేసింది. సర్వప్రియ సంగ్వాన్ అనే ట్విట్టర్ యూజర్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 215లో తన భోజనంలో వచ్చిన ఒక రాయిని చూపిస్తూ భోజనానికి సంబంధించిన రెండు ఫొటోలను షేర్ చేశారు.
ఒక ట్వీట్‌లో, ఆమె ఎయిర్ ఇండియాను ట్యాగ్ చేసి, ''రాళ్లు లేని ఆహారాన్ని అందించడానికి మీకు వనరులు, డబ్బు అవసరం లేదు ఎయిర్ ఇండియా (@airindiain). ఈ రోజు AI 215 విమానంలో అందించిన నా ఆహారంలో నేను అందుకున్నది ఇదే. ఈ రకమైన నిర్లక్ష్యం ఆమోదయోగ్యం కాదు.. అని పేర్కొన్నారు.