
Nirmala Sitharaman: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చే సరుకులపై మొత్తం 50% టారిఫ్ ను విధించారు. భారత ఎగుమతిదారులపై అమెరికా విధించిన అధిక టారిఫ్‌లు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారాయి. ఆగస్టు 27 నుంచి ఈ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటికే జీఎస్టీలో మార్పులు చేసింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. “అమెరికా 50% టారిఫ్‌ల కారణంగా నష్టపోతున్న ఎగుమతిదారులకు ప్రభుత్వం సహాయక ప్యాకేజ్‌ను సిద్ధం చేస్తోంది. వారిని అసహాయ స్థితిలో వదిలేయలేం” అని నెట్‌వర్క్ 18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ప్యాకేజ్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నట్టు వెల్లడించారు.
జీఎస్టీ సంస్కరణల గురించి సీతారామన్ మాట్లాడుతూ.. రెండు జీఎస్టీ స్లాబ్‌లు తొలగించడమే కాకుండా రోజువారీ వినియోగ వస్తువులపై పన్నులు తగ్గించామని అన్నారు. ఈ నిర్మాణాత్మక సంస్కరణలు అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ఆమె పేర్కొన్నారు.
ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై ముందుగా 25% రిసిప్రోకల్ టారిఫ్ విధించింది. తరువాత రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అదనంగా 25% టారిఫ్ విధించింది. దీంతో మొత్తం టారిఫ్ 50%కి చేరింది. ట్రంప్ భారత్‌ను "టారిఫ్ కింగ్" అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. ఈ చర్యలతో భారత ఎగుమతిదారులు కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఎగుమతుల అవకాశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. చైనాలో మార్కెట్ యాక్సెస్ సమస్యను ప్రస్తావించారు. దశాబ్ద కాలంగా చైనా మార్కెట్‌లోకి ప్రవేశం కోసం చర్చలు జరిగినా ఇంకా పూర్తిగా పరిష్కారాలు రాలేదని తెలిపారు. భారత ఉత్పత్తులు నేరుగా వెళ్లకుండా ఇతర దేశాల ద్వారా చైనా చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు వాణిజ్య చర్చలు అవసరమని ఆమె వివరించారు.