
India-Australia talk: ఉగ్రవాదం, అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మధ్య జరిగిన తొలి వార్షిక భారత్-ఆస్ట్రేలియా శిఖరాగ్ర సదస్సులో చర్చించారు. అంతకుముందు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో ప్రధాని నరేంద్ర మోడీ కలిసి పలు అంశాలపై చర్చించారు. ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలు, మౌలిక సదుపాయాలను నిర్మూలించడానికి, ఉగ్రవాద నెట్ వర్క్ లను, వాటి ఆర్థిక మార్గాలను భగ్నం చేయడానికి, టెర్రరిస్టు ప్రాక్సీల వినియోగం, సీమాంతర ఉగ్రవాదుల కదలికలను నిరోధించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని రెండు దేశాల అధినేతలు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీర్మానాలను ఉల్లంఘిస్తూ ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను ఇరువురు ప్రధానులు ఖండించారు. ఉత్తరకొరియాను పూర్తిగా అణ్వస్త్రరహితం చేసేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
2028-2029 (భారత్), 2029-2030 (ఆస్ట్రేలియా) టర్మ్ లకు సంబంధించి యూఎన్ఎస్సీలో నాన్ పర్మినెంట్ సీట్ల కోసం జరిగే అభ్యర్థిత్వంలో ఇరు దేశాలు పరస్పరం మద్దతు ఇస్తామని హామీ ఇచ్చాయి. యూఎన్ఎస్సీలో భారత్ శాశ్వత సభ్యత్వ అభ్యర్థిత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని స్పష్టం చేశారు. మయన్మార్ లో క్షీణిస్తున్న పరిస్థితిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే హింసను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో దేవాలయాల విధ్వంస ఘటనల విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధాని మోడీ ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని వారాలుగా ఆస్ట్రేలియా నుంచి దేవాలయాలపై దాడుల వార్తలు క్రమం తప్పకుండా వస్తున్నాయనీ, ఇలాంటి వార్తలు భారతదేశంలోని ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేయడం సహజమని ప్రధాని మోడీ అన్నారు.
ఇరువురు ప్రధానులు ఆర్థిక, వాణిజ్య సహకారం వంటి అంశాలపై చర్చించారు. శీతోష్ణస్థితి, శక్తి, శాస్త్ర, సాంకేతిక-పరిశోధన సహకారం, ప్రజల మధ్య సంబంధాలు, కోవిడ్-19 మహమ్మారి, ప్రాంతీయ-బహుపాక్షిక సహకారం వంటి విషయాలు ఇరు దేశాల్లో చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. కాగా, నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ముంబయిలో పర్యటించారు. ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరంలో ఆయనకు 'టిఫిన్ బాక్స్' (ముంబైలో 'డబ్బా'గా ప్రసిద్ధి) బహూకరించారు. ముంబయిలోని సంప్రదాయ డబ్బావాలాలు 5000 మందితో కూడిన బృందం, వారు ప్రతిరోజూ వినియోగదారుల ఇంటికి, వారి కార్యాలయాలకు మధ్య ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని రవాణా చేస్తారు. 120 సంవత్సరాలకు పైగా ముంబయిలో డబ్బవాలాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.