2023 సంవత్సరం భారతీయుల సృజనాత్మకత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: భారత దేశం ఇన్నోవేషన్ హబ్ గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 2024 లో కూడ ఇదే స్పూర్తిని, ఊపును కొనసాగించాలన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ప్రసంగించారు. 2023 సంవత్సరంలో ఇదే చివరి మన్ కీ బాత్ కార్యక్రమం. దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మన్ కీ బాత్ 108 వ ఎపిసోడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు.
సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారు.ప్రపంచంలో ఐదో ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిందన్నారు.ఈ విషయమై ప్రజలు లేఖలు రాశారన్నారు.2024 సంవత్సరం తొలి సూర్యోదయం మన్ కీ బాత్ మరునాడే జరగడం ఆనందం కలిగిస్తుందన్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం దేశం మొత్తం ఉత్సాహంగా ఎదురు చూస్తుందన్నారు. భజనలు, పద్యాలు రాయడం, పెయింటింగ్స్ వేయడం ద్వారా ప్రజలు రకరకాలుగా తమ భావాలను వ్యక్తీకరిస్తున్నారన్నారు. రామ మందిరం భారత దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
దేశం విక్షిత్ భారత్, స్వావలంభన స్పూర్తితో నింపబడిందన్నారు. 2024లో కూడ ఇదే స్పూర్తిని, వేగాన్ని కొనసాగించాలని మోడీ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఫిట్ ఇండియా కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ఫిట్ నెస్ చిట్కాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మ నిర్బర్ భారత్ స్పూర్తిని నింపిందని మోడీ పేర్కొన్నారు.చంద్రయాన్ -3 విజయవంతం కావడంపై కూడ మోడీ ప్రస్తావించారు. ఇది భారత్ కే గర్వకారణమన్నారు. ఈ ఏడాది నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడాన్ని మోడీ గుర్తు చేశారు. ఈ ఘటన భారతీయులు సృజనాత్మకు దర్పణం పడుతుందన్నారు.