
రోజురోజుకీ పెరుగుతున్న కరెంటు బిల్లులు ఇప్పుడు చాలా మందికి పెద్ద తలనొప్పిగా మారింది. వేసవిలో ఏసీలు, ఫ్రిజ్జులు వాడకం పెరగడం, చలికాలంలో హీటర్లు వాడటం వల్ల కరెంటు బిల్లు భారం పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటీ ముంబై శాస్త్రవేత్తలు కొత్త సోలార్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
సోలార్ సాంకేతికతలో కీలక ముందడుగుగా, ఐఐటీ బొంబాయి శాస్త్రవేత్తలు అధిక సామర్థ్యం గల టాండమ్ సోలార్ సెల్‌ను రూపొందించారు. ఇది సాధారణ సోలార్ సెల్ కంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐఐటీ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ ఫోటోవోల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిపిఆర్‌ఇ) లోని ప్రొఫెసర్ దినేష్ కబ్రా బృందం ఈ కొత్త సోలార్ సెల్‌ను అభివృద్ధి చేసింది. పై పొరలో హాలైడ్ పెరోవ్‌స్కైట్‌ను ఉపయోగించడం వల్ల ఈ టాండమ్ సోలార్ సెల్ తక్కువ వెలుతురులో కూడా ఎక్కువ కాంతిని గ్రహిస్తుంది.
సోలార్ పరిశ్రమలో ఇప్పటికే విస్తృతంగా ఉపయోగిస్తున్న సిలికాన్‌తో దిగువ పొరను తయారు చేశారు. ఇది అధిక విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతుంది. సాధారణ సోలార్ ప్యానెళ్లు సూర్యకాంతిలో దాదాపు 20 శాతం మాత్రమే విద్యుత్తుగా మారుస్తాయి. కానీ ఈ కొత్త సాంకేతికత 30% వరకు సామర్థ్యాన్ని సాధించగలదు. దీనివల్ల కరెంటు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. యూనిట్‌కు రూ.2.5 నుంచి రూ.4 వరకు ఉండే ధర ఇప్పుడు కేవలం రూ.1కి తగ్గే అవకాశం ఉంది.
ఇతర సోలార్ టెక్నాలజీల మాదిరిగా దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడకుండా, ఈ సాంకేతికత పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. ముడి పదార్థాలు దేశీయంగానే సులభంగా లభిస్తాయి. గతంలో, భారతదేశం తన సోలార్ ప్యానెల్ సామగ్రిలో ఎక్కువ భాగాన్ని చైనా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. పెరోవ్‌స్కైట్ ఉపయోగంలో ఉన్న ప్రధాన అడ్డంకి దాని మన్నిక. కానీ ఐఐటీ ముంబై బృందం దాని జీవితకాలాన్ని 10 సంవత్సరాలకు పెంచింది. ఇది సోలార్ సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం, ఐఐటీ ముంబై మద్దతుతో ఏర్పాటైన స్టార్టప్ సంస్థ ఎఆర్టి-పివి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2027 డిసెంబర్ నాటికి ఈ కొత్త సోలార్ సెల్‌లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. అన్ని యంత్రాలు, తయారీ ప్రక్రియ భారతదేశంలోనే జరుగుతుంది. ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ దినేష్ కబ్రా ఈ స్టార్టప్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ సాంకేతికత పెద్ద సోలార్ ప్లాంట్లకే పరిమితం కాదు. ఇళ్లపై, భవనాలపై, వాహనాలపై కూడా దీన్ని అమర్చవచ్చు. దీంతో సోలార్ శక్తిని మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకురావచ్చు. భవిష్యత్తులో హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా ఈ సాంకేతికతను ఉపయోగించాలని ఐఐటీ ముంబై, మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాయి.