మీరు గన్ కొనాలనుకుంటే తప్పకుండా ప్రభుత్వం నుండి అనుమతి పొందడం తప్పనిసరి. అయితే గన్ వాడేందుకు లైసెన్స్ ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.
Gun Licence : అమెరికా వంటి దేశాల్లో గన్ కల్చర్ చాలా ఎక్కువ. మనదగ్గర కిరాణాషాపుల్లో సరుకులు దొరికినట్లు చాలా దేశాల్లో మారణాయుధాలు లభిస్తాయి. అందువల్లే ఆయా దేశాల్లో తుపాకీ తూటాలకు చాలాసార్లు అమాయకులు బలి అవుతుంటారు. కానీ భారతదేశంలో ఇలాంటి దారుణాలు జరక్కుండా ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఎవరికి పడితే వారికి ఆయుధాలు ఇవ్వకుండా కేవలం అవసరం ఉన్నవారికే ఇస్తారు. ఎవరైనా తుపాకీ పొందాలంటే లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి... లేకుండా వాడితే చట్టరిత్యా నేరం.
భారతదేశంలో తుపాకీ లైసెన్స్ పొందడం అంత ఈజీ కాదు. గన్ లైసెన్స్ అనేక పరిమితులతో జారీ చేయబడుతుంది. ఎవరికైనా ప్రమాదం పొంచివుంటే ఆత్మరక్షణ కోసం తుపాకీ పొందవచ్చు. అలాగే కొందరు రైతులు పంటల రక్షణ కోసం తుపాకీ వాడవచ్చు. షూటింగ్ క్రీడల కోసం కూడా గన్ పొందవచ్చు. ఇలాంటి ముఖ్యమైన కారణాలతో గన్ కావాలనుకునేవారు లైసెన్స్ పొందుతారు. అలాకాకుండా అసాంఘిక కార్యకలాపాలకోసమో, సరదా కోసమో తుపాకీ కొనుగోలుచేయాలంటే లైసెన్స్ ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తారు.
తుపాకీ లైసెన్స్ పొందాలనుకునేవారు పక్కా పత్రాలతో అధికారులను సంప్రదించాలి. నిజంగానే వారికి తుపాకీ అవసరం ఉదా అనేది నిర్దారించడానికి అధికారులు విచారణ చేపడతారు. నిజంగానే అవసరం అనుకుంటేనే లైసెన్స్ జారీ చేస్తారు. ఇలా తుపాకీ లైసెన్స్ జారీ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం.
తుపాకీ కొనుగోలు చేయాలనుకునే వ్యక్తి ముందుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలతో పాటు మానసిక పరిస్థితి, గన్ ఎందుకు అవసరం తదితర వివరాలను తెలియజేస్తూ పలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం
దరఖాస్తులు అందిన తర్వాత ఆ జిల్లా కార్యాలయం వివిధ రకాలుగా విచారణలు నిర్వహిస్తుంది. దరఖాస్తుదారుడు తుపాకీని ఎందుకు కొనాలనుకుంటున్నాడు? అతడు ఎదుర్కొంటున్న బెదిరింపుల గురించి వివరాలను సేకరిస్తారు. అలాగే దరఖాస్తుదారుడిపై ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తారు. అతడిపై ఇప్పటికే క్రిమినల్ లేదా సివిల్ ఫిర్యాదులు ఉంటే తుపాకీ లైసెన్స్ నిరాకరించబడుతుంది. లైసెన్స్ పొందితే మూడు నెలల్లోపు గన్ కొనుగోలు చేసుకోవచ్చు.
ఒక్కసారి తుపాకీ లైసెన్స్ పొందాక మూడు సంవత్సరాలపాటు ఉపయోగించవచ్చు. ఆ తర్వాత లైసెన్స్ ను పునరుద్దరించుకోవాల్సి ఉంటుంది. తుపాకీ లైసెన్స్ రెన్యువల్ కోసం పోలీసుల నుండి సత్ప్రవర్తన ధృవీకరణ పత్రం అవసరం. నిబంధనలను అతిక్రమిస్తూ తుపాకీని ఉపయోగించినా, దాంతో ఎవరినైనా బెదిరించినట్లు పోలీసులు తేల్చినా లైసెన్స్ రద్దు అవుతుంది.
తుపాకీ లైసెన్స్ ఉన్న వ్యక్తి గరిష్టంగా మూడు తుపాకులను కలిగి ఉండవచ్చు. అలాగే సంవత్సరానికి 100 బుల్లెట్ల వరకు కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు. తుపాకీ లేదా మందుగుండు సామగ్రిని ఉపయోగించినప్పుడు లైసెన్స్ పొందిన వ్యక్తి పూర్తి బాధ్యత తీసుకోవాలి.
పర్మిట్ హోల్డర్ ఒక నిర్దిష్ట రాష్ట్రంలో మాత్రమే తుపాకీని కలిగి ఉండాలి. ఇతర రాష్ట్రాలకు తుపాకీని తీసుకుని వెళ్లేటప్పుడు పోలీసుల అనుమతి తప్పనిసరి. విదేశాలకు వెళ్లేటప్పుడు తుపాకీని అప్పగించడానికి మార్గాలు ఉన్నాయి. తుపాకీని శాశ్వతంగా అప్పగించాలనుకునే వారు దాని కోసం పొందిన లైసెన్స్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి. తర్వాత సంబంధిత సర్టిఫికెట్ పొందాలి.