రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య నగరం భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు మొత్తం నగరవ్యాప్తంగా హైసెక్యూరిటీ ఏర్పాటుచేసారు.
అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మించిన భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుకలకు సర్వం సిద్దమయ్యింది. ఇప్పటికే బాల రామయ్య ఆలయ గర్భగుడిలోకి చేరుకున్నారు. రేపు (సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రాజకీయ, వ్యాపార, సినిమాలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో అయోధ్య ఆలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గర్భగుడిలో కొలువైన బాలరాముడికి ఆభరణాలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
రామమందిర ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీతో పాటు వేలాదిగా ప్రముఖులు అయోధ్యకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే అయోధ్య నగరాన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు తమ ఆధీనంలోని తీసుకున్నాయి. రామమందిరం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలోనే బారీకేడ్లను ఏర్పాటుచేసి వాహనాలను నిలిపివేస్తున్నారు. కేవలం స్థానికులు, పాసులు వున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. ఇవాళ్టి నుండే ఆంక్షలు అమలుచేస్తున్న భద్రతా సిబ్బంది రేపు(సోమవారం) వాటిని మరింత కఠినతరం చేయనున్నారు.
Also Read రామభక్తుడిగా అసదుద్దీన్ ఓవైసి ... రామనామ స్మరణ తప్పదు..: విహెచ్‌పి నేత సంచలనం
అయోధ్య రామమందిరంతో పాటు నగరమంతా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. పదివేలమందికి పైగా రాష్ట్ర, కేంద్ర బలగాలు అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. 100 మందికి పైగా డిఎస్పీలు, 320 మంది సిఐలు, 800 మంది ఎస్సైలు, వేలాదిమంది కానిస్టేబుల్స్ అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ భద్రతా వ్యవహారాలను యూపీ స్పెషల్ డిజిపి ప్రశాంత్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఇక హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే దాదాపు 10వేలకు పైగా సిసి కెమెరాలను అయోధ్య మొత్తం ఏర్పాటుచేసారు. అలాగే డ్రోన్ కెమెరాలను కూడా భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. ఇక ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ ను సిద్దం చేసారు. ఇలా అయోధ్యలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసేలా యూపీ పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.