
Heavy rains: దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే డజన్ల మంది చనిపోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుత రుతుపవనాలు, వర్షాల పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు సీనియర్ కేంద్ర మంత్రులు ఈ సమావేశానికి ప్రధాని నివాసంలో హాజరైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా, భారీ వర్షాల మధ్య యమునా నది మంగళవారం 'ఎవాక్యుయేషన్ మార్క్' 206 మీటర్లను అధిగమించడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఢిల్లీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేజ్రీవాల్ సర్కారు ఢిల్లీ ప్రజలను అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది, ఉత్తరాఖండ్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగి సమీప ప్రాంతాలను ముంచెత్తడంతో కొండచరియలు విరిగిపడి వాహనాలు దెబ్బతినడంతో పలువురు పర్యాటకులు చిక్కుకుపోయారు. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ రోజు ఏరియల్ సర్వే నిర్వహించి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది మరణించారు. ఎనిమిది మందిలో ఐదుగురు పిడుగుపాటుకు, 2 మంది నీటిలో మునిగి, ఒకరు పాము కాటుకు గురై మరణించారు. యూపీలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 33 జిల్లాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని చవిచూశాయి, 21 జిల్లాల్లో ఈ సమయంలో ప్రతి సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదైంది, 9 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు తంటాలు పడుతుంటే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం తన సమావేశాలను రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఘగ్గర్, యమునా నదుల్లో నీటి మట్టాలు పెరగడం వల్ల తలెత్తిన పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.