సావర్కర్ దేశభక్తిని ప్రశ్నించలేం.. ఆయనను విమర్శించడానికి సిగ్గుండాలి: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

By telugu teamFirst Published Oct 15, 2021, 8:04 PM IST
Highlights

సావర్కర్ దేశభక్తిని ప్రశ్నించలేమని, ఆయన ధైర్య సాహసాలు, దేశంపట్ల చిత్తశుద్ధి అసాధారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. సావర్కర్‌పై విమర్శలు చేస్తున్నవారికి సిగ్గు ఉండాలని విరుచుకుపడ్డారు. అండమాన్ పర్యటనలో ఉన్న అమిత్ షా సెల్యూలర్ జైలును మహాతీర్థ్‌గా ప్రకటించారు. ఇటీవలే సావర్కర్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
 

న్యూఢిల్లీ: సావర్కర్‌ను విమర్శించేవారిపై కేంద్ర హోం మంత్రి Amit Shah మండిపడ్డారు. Savarkar దేశ భక్తిని, ధైర్య సాహసాలను ప్రశ్నించలేమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ చిత్తశుధ్దిని అనుమానించేవారు సిగ్గుపడాలని విమర్శించారు. కేంద్ర రక్షణ మంత్రి Rajnath Singh ఇటీవలే చేసిన కామెంట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ విమర్శలను తప్పుబట్టారు. అండమాన్ పర్యటనలో ఉన్న అమిత్ షా ధ్వజమెత్తారు.

రెండు జీవిత కాలాల శిక్ష పడిన ఒక వ్యక్తి ఆదర్శాలను ఎవరైనా ఎలా అనుమానిస్తారని అమిత్ షా ప్రశ్నించారు. అండమాన్ జైలులో నూనె గానుగలో ఎద్దులో ఆయనను తింపారని, అంత చెమట వడిచినా ఆదర్శాలను సావర్కర్ పక్కనపెట్టలేదని వివరించారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని విమర్శించాలనుకుంటున్నారా? కొంతైనా సిగ్గుండాలి అని మండిపడ్డారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యూలర్ jailలో స్వాతంత్ర్య సమరయోధులను బంధించి బ్రిటీషర్లు శిక్షించారు.

సావర్కర్ మంచి జీవితాన్ని లీడ్ చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్న వ్యక్తి అని, అయినప్పటికీ దుర్గమమైన దారినే ఎంచుకున్నాడని, మాతృభూమి కోసం ఆయన చిత్తశుద్ధి చెక్కుచెదరనిది అని అమిత్ షా తెలిపారు.

ఈ సెల్యూలర్ జైలుకు మించిన తీర్థస్థలమేదీ ఉండదని అమిత్ షా అన్నారు. పదేళ్లుగా సావర్కర్ అమానవీయ శిక్ష అనుభవించిన ఈ జైలు మహాతీర్థ్ అని తెలిపారు. పదేళ్లు కఠిన శిక్ష అనుభవించినప్పటికీ తన ధైర్యాన్ని కోల్పోని వ్యక్తి సావర్కర్ అని వివరించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా అండమాన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ఈ రోజు మాట్లాడారు.

సావర్కర్‌కు వీర్ అనే పదం ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. కానీ, ఈ దేశ 130 కోట్ల ప్రజలే ఆయనకు వీర్ అనే బిరుదును ఇచ్చారని తెలిపారు. దాన్ని ఇంకెవరూ దూరం చేయలేరని స్పష్టం చేశారు. ఆయన ధైర్యసాహసాలు, ధీరత్వానికి గుర్తుగా వీర్ అనే బిరుదుతో ప్రజలు ఆయనను సత్కరించారని చెప్పారు. 

Also Read: సావర్కర్‌పై రచ్చ.. బీజేపీ ఆయనను జాతిపితగా ప్రకటిస్తుంది.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఒవైసీ మండిపాటు

స్వాతంత్ర్య సమరయోధుల సమాధులపై పుష్పగుచ్ఛం పెట్టి వారికి నివాళ్ళు అర్పించారు.

ఇప్పుడున్న ప్రజల్లో చాలా మంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించారని, వారికి దేశం కోసమే ప్రాణాలు అర్పించే అవకాశం దక్కలేదని అమిత్ షా చెప్పారు. కాబట్టి తాను ఇప్పటి యువతకు తనది ఒకే సూచన అని వివరించారు. ఈ గొప్ప దేశం కోసం జీవించాలని పిలుపునిచ్చారు.

ఇటీవలే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సావర్కర్‌పై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయని, ఆయన బ్రిటీషర్లకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారని, అనేక ఇతర ఆరోపణలు వినిపిస్తుంటాయని సింగ్ చెప్పారు. అయితే, మహాత్మా గాంధీ సూచన మేరకే సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాభిక్ష విన్నపాలు చేశారని వివరించారు. ఆయన ఆలోచనధారతో విభేదాలు ఉండవచ్చునని, కానీ, ఆయనను ఒక పిరికివాడిగా ప్రచారం చేయవద్దని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే బీజేపీ త్వరలోనే మహాత్మా గాంధీ స్థానంలో జాతిపితగా సావర్కర్‌ను ప్రకటిస్తారని విమర్శించారు.

click me!