దుర్గా మాత నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

By telugu teamFirst Published Oct 15, 2021, 6:39 PM IST
Highlights

దుర్గా మాత నిమజ్జానానికి వెళ్తున్న భక్తుల ఊరేగింపుపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 
 

రాయ్‌పూర్: చత్తీస్‌గడ్‌లో అవాంఛనీయ ఘటన జరిగింది. దుర్గా మాత నిమజ్జనానికి తీసుకెళ్తున్న భక్తులపైకి వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఆగకుండా దూసుకెళ్లింది. ఆ ఊరేగింపు చివరికి వరకు కారు రోడ్డుపైనున్న భక్తులను ఢీకొంటూనే వెళ్లిపోయింది. కొద్ది దూరాన కారును ఆపి డ్రైవర్ పరారయ్యారు. ఊరేగింపులోనున్న ఇతరులు ఆ కారు వెంట పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ఘటన జష్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జష్‌పూర్ జిల్లా పథల్‌గావ్ నివాసి గౌరవ్ అగర్వాల్‌తోపాటు మరో ముగ్గురు ఈ ఘటనలో మరణించారు. కాగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పథల్‌గావ్ సివిల్ హాస్పిటల్‌లో చికిత్సకు తరలించారు. తీవ్రంగా గాయపడి, ఎముకలు విరిగిన ఇద్దరు పేషెంట్లను మరో హాస్పిటల్‌కు తరలించినట్టు బ్లాక్ మెడికల్ అధికారి జేమ్స్ మింజ్ వివరించారు.

మధ్యప్రదేశ్‌‌ పేరటి నంబర్ ప్లేట్ ఉన్న మహీంద్రా జైలో కారు సుఖ్రాపారావైపు వెళ్తూ భక్తులను ఢీకొట్టింది. అక్కడే ఉన్న ఇతర భక్తులు ఆగ్రహంతో కారు వెంట పరుగులు తీశారు. కొద్ది దూరంలో ఆ కారును రోడ్డు పక్కన ఉన్నట్టు గమనించారు. అక్కడికి చేరగా డ్రైవర్ వైపు డోర్ తీసే ఉన్నది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి.

Scary Visuals From Jashpur Chhattisgarh- A speeding vehicle rams into a group of people , several injured pic.twitter.com/5fHfORXRUo

— Utkarsh Singh (@utkarshs88)

ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 21ఏళ్ల బబ్లు విశ్వకర్మ, 26 ఏళ్ల శిశుపాల్ సాహులను అరెస్టు చేసి అభియోగాలు నమోదు చేశారు. వీరిరువురు మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాకు చెందినవారు. కానీ, చత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణిస్తున్నారని పోలీసులు వివరించారు.

Also Read: Lakhimpur Kheri: రాజకీయ నేతలంటే ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదు: యూపీ బీజేపీ చీఫ్

ఈ ఘటనపై చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించామని, ఎవ్వరినీ వదిలిపెట్టబోమని వెల్లడించారు. అందరికీ న్యాయం అందిస్తామని, మృతి చెందిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ట్వీట్ చేశారు.

ఇదే నెలలో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా తనయుడి కాన్వాయ్ రైతు ఆందోళనకారులపై నుంచి దూసుకెళ్లింది. ఇందులో నలుగురు రైతులు సహా ఒక జర్నలిస్టు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

click me!