
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని లాల్ ఖిల్లా అదేనండీ ఎర్రకోట(Red Fort)కు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనదేశంలోని పురాతన కట్టడాల్లో ఈ ఎర్రకోటకూ ప్రత్యేకత ఉన్నది. దేశ ప్రధాన మంత్రి ప్రతి యేటా స్వాతంత్ర్య దినోత్సవాన ఈ ఎర్రకోటపైనే జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. ఈ వారసత్వ సంపదను ప్రజలు గర్వంగా స్వీకరిస్తుంటారు. అలాంటి ఎర్రకోట నాదే అంటూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, ఆ కట్టడాన్ని తనకు హ్యాండోవర్(Hand Over) చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇన్నాళ్లు అక్రమంగా తమ కట్టడాన్ని వినియోగించుకున్నందుకు పరిహారం కూడా అందించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ ఆసక్తిని రేపింది. పిటిషనర్ దారు చరిత్ర కూడా ఆసక్తి కలిగించేలా ఉన్నది. ఎర్రకోట నిర్మాణం తమదేనని వాదిస్తూ పిటిషన్ దాఖలు చేసిన మహిళ ముఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షా జాఫర్ మనవడి భార్య. తన భర్త పేరు మీర్జా మహమ్మద్ బేదార్ బక్త్ 1980 మే 22వ తేదీన మరణించారు. పిటిషనర్ పేరు సుల్తానా బేగమ్. ఆమె ఇప్పుడు ఎర్రకోట తమదే అంటూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలోని ఎర్రకోట కట్టడానికి తాను అధికారిక వారసురాలినని ఆమె వాదించారు. ఆ కట్టడాన్ని 1857లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్రమంగా తమ నుంచి ఆక్రమించుకున్నదని ఆరోపణలు చేశారు.
Also Read: ఢిల్లీలో బయటపడ్డ ఎర్రకోట సొరంగం.. బ్రిటీషర్లు దీనిని దేనికోసం వినియోగించారంటే?
అంతేకాదు, వెంటనే తనకు తమ ఎర్రకోట కట్టడాన్ని హ్యాండోవర్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోర్టును కోరారు. ఈ కట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తన పరిధిలో ఉంచుకుంటున్నదని వాదించారు. కాబట్టి 1857 నుంచి ఎర్రకోటను అక్రమంగా తన పరిధిలో ఉంచుకున్నందుకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. ఈ విచిత్ర వాదన ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ ముందుక వచ్చింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ రేఖా పల్లి విచారించారు.
ఈ పిటిషనర్ వాదనలను న్యాయమూర్తి జస్టిస్ రేఖా పల్లి తేలికగా తోసిపుచ్చారు. ఎర్రకోట కట్టడం తమదే అయినప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు కోర్టు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. కోర్టును ఆశ్రయించడానికి సుమారు 150 సంవత్సరాల ఆలస్యం ఎందుకు జరిగిందని అడిగారు. ఈ అసాధారణ ఆలస్యాన్ని పేర్కొంటూ ఆమె పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఇన్ని సంవత్సరాలు వారు ఏం చేశారని ప్రశ్నించారు. సరైన సమయంలో ఎందుకు పిటిషన్లు దాఖలు కాలేదని అన్నారు. ఒకవేళ ఆమె పూర్వీకులు ఎర్రకోట తమదేనని పిటిషన్లు వేయనప్పుడు.. ఇప్పుడు ఈమె ఈ పిటిషన్లు వేయడానికి అర్హురాలేనా? అనిక కూడా అడిగారు.
Also Read: independence day: నూతన విద్యా విధానం.. పేదరికంపై ఒక అస్త్రం.. క్రీడలకూ ప్రాధాన్యత: ప్రధాని మోడీ
ఢిల్లీలో ఒక సొరంగం బయటపడింది. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటను అనుసంధానించేదిగా భావిస్తున్న సొరంగం కనిపించింది. దీనికి ఘనమైన చరిత్ర ఉన్నట్టు తెలుస్తున్నది. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన చరిత్ర ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ సొరంగంపై ఆసక్తి వెల్లడవుతున్నది.
మనదేశం సమరయోధులను కోర్టు నుంచి లాల్ ఖిల్లాకు తరలించేటప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు, ప్రతీకారాలను నివారించడానికి బ్రిటీషర్లు దొడ్డిదారిని ఉపయోగించేవారు. అందులో భాగంగానే కోర్టు నుంచి నేరుగా ఎర్రకోటకు తీసుకెళ్లే ఈ సొరంగాన్ని వినియోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెల్లడించారు.