మీ పిల్లల్ని అర్థరాత్రుళ్లు బయటికి పంపి.. పోలీసులను నిందిస్తారా: రేప్ కేసుపై గోవా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 29, 2021, 2:24 PM IST
Highlights

సంచలనం సృష్టించిన  గోవా  అత్యాచార ఘటపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్  సావంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాత్రుళ్లు తిరిగేందుకు ఎందుకు భయపడాలని ప్రశ్నించింది

ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అర్ధరాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతించడంపై అసెంబ్లీ వేదికగా సీఎం తల్లిదండ్రుల్ని నిందించారు. దాంతో ఆయన వైఖరిని విపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.   

ఆయన ఏమన్నారంటే.. పదిమంది పిల్లలు బీచ్‌లో పార్టీ చేసుకున్నారని వారిలో ఆరుగురు తిరిగొచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు మాత్రం ఆ రాత్రి అక్కడే ఉండిపోయారని 14 ఏళ్ల పిల్లలు అక్కడ ఉన్నారంటే వారి తల్లిదండ్రులు దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ప్రమోద్ సావంత్ చురకలు వేశారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదని.. ఆ బాధ్యతనంతా పోలీసులపై వదిలేయలేం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాత్రిపూట ఆడపిల్లలు బయటకు వెళ్లడానికి అనుమతించరాదని, మరీ ముఖ్యంగా వారు మైనర్లుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటూ సీఎం హితవు పలికారు.   

ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. రాత్రుళ్లు తిరిగేందుకు ఎందుకు భయపడాలని ప్రశ్నించింది. నేరస్థులు జైల్లో ఉండాలని.. చట్టాన్ని గౌరవించేవారు స్వేచ్ఛగా తిరిగేలా ఉండాలి అంటూ విరుచుకుపడింది. దీనిపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ఆ ప్రవర్తన కోసం ముఖ్యమంత్రి తన పదవి నుంచి వైదొలిగి, ఇంటికి వెళ్లాలి అంటూ మండిపడ్డారు. కాగా, జులై 24న పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలోని కోవ్లా బీచ్‌లో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. వారి వెంట ఉన్న ఇద్దరు బాలురు సైతం దాడికి గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

click me!