
భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 1,200 దాటడంతో పాటు తొలి ఒమిక్రాన్ మరణం సంభవించడంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన మరిచిపోకముందే దేశంలో ఒమిక్రాన్ కారణంగా రెండో మరణం సంభవించింది. రాజస్థాన్ లోని (rajasthan) ఉదయ్ పూర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్ తో కన్నుమూశాడు. బాధితుడికి డిసెంబరు 15న కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతని శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిసెంబరు 22న కొవిడ్ నెగెటివ్ అని వచ్చినా, కరోనా అనంతర న్యూమోనియాతో వృద్ధుడు మరణించినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఆ వృద్ధుడికి మధుమేహం, రక్తపోటు, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు ఉన్నాయని అధికారులు వివరించారు. రాజస్థాన్‌లో ఇదే తొలి ఒమిక్రాన్ మరణం కాగా, దేశంలో రెండోది.
అంతకుముందు మహారాష్ట్రలో (Maharashtra) ఇటీవల గుండెపోటుతో మరణించిన 52 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించబడింది. మరణించిన వ్యక్తికి నైజీరియా (Nigeria) ట్రావెల్ హిస్టరీ కూడా కలిగి ఉండటంతో దానిని ఒమిక్రాన్ మరణంగానే భావిస్తున్నారు. అయితే అతడి మరణానికి కోవిడ్ (covid) కారణం కాదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే అతని శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఒక బులిటెన్ విడుదల చేశారు.
Also Read:భారత్‌లో తొలి ఒమిక్రాన్ మరణం?.. కానీ అధికారులు మాత్రం ఏం చెబుతున్నారంటే..
‘నైజీరియా ట్రావెల్ హిస్టరీ కలిగిన 52 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 28న పుణె సమీపంలోని పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యశ్వంతరావు చవాన్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఈ వ్యక్తికి గత 13 సంవత్సరాలుగా మధుమేహం ఉంది. ఈ రోగి మరణం కోవిడ్ కాని కారణాల వల్ల, యాదృచ్ఛికంగా జరిగింది. అయితే NIV ఇచ్చిన నివేదిక అతనికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు వెల్లడిస్తోంది’ అని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక, మహారాష్ట్రలో గురువారం కొత్తగా 5,368 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 22 మంది మరణించారు. మరోవైపు గురువారం మహారాష్ట్రలో 198 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది. కొత్తగా నమోదైన 198 ఒమిక్రాన్ కేసుల్లో.. 30 మంది అంతర్జాతీయ ప్రయాణికులు. తాజాగా కేసుల్లో ముంబైలో 190, థానేలో 4, సతారా, నాందెడ్, పుణె, పింప్రి చించ్‌వాడ్‌లో ఒక్కటి చొప్పున నివేదించబడ్డాయి.