
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ కేటుగాళ్లు(Cyber Fraudsters) తమ వ్యూహాన్ని మార్చి.. ఈ భయాలనే క్యాష్ చేసుకోవడానికి పన్నాగం పన్నుతున్నారు. ఉచితంగా ఒమిక్రాన్ టెస్టు చేస్తామని నమ్మబలుకుతున్నారు. మెసేజ్‌లు, మెయిళ్ల రూపంలో వల వేస్తున్నాయి. వారు పంపిన లింక్‌లు క్లిక్ చేయగానే.. నకిలీ వెబ్‌సైట్(Fake Website)కు తీసుకెళ్తున్నారు. అక్కడ వ్యక్తిగత సమాచారాన్ని దోచుకోవడం లేదా బ్యాంకు సంబంధ వివరాలను తస్కరిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొందరు కేటుగాళ్లు ఉచిత ఒమిక్రాన్ టెస్టుల పేరిట ఎర వేస్తున్నారని తెలిపింది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ(Home Affairs Ministry)కు చెందిన సైబర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ కొన్ని సూచనలు చేసింది.
సైబర్ నేరగాళ్లు ఆరోగ్య సంక్షోభంపై ఫోకస్ పెట్టి ప్రజలను సులువుగా బోల్తా కొట్టే వ్యూహాన్ని వేస్తున్నారని తెలిపింది. పౌరులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు ఎప్పుడూ కొత్త కొత్త దారులను ఎంచుకుంటారని వివరించింది. ఇప్పుడు ఒమిక్రాన్ ఆధారంగా జరుగుతున్న మోసాలు రోజుకు రోజూ పెరుగుతున్నాయని పేర్కొంది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలను ఆధారం చేసుకుని అమాయక పౌరులను ఉచ్చులో వేసుకుని దోచుకుంటున్నారని తెలిపింది. కొందరు ఒమిక్రాన్ నిర్ధారణ టెస్టుల కోసం కుట్రపూరిత లింకులను పంపిస్తున్నారని వివరించింది.
కొందరు సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సేవలు అందించే సంస్థలను పోలిన లింకులను పంపిస్తున్నారని తెలిపింది. పంపిస్తున్న వారిలో ఆ పేర్లను చేర్చి పౌరులను సులువుగా మోసం చేస్తున్నారని వివరించింది. ఆ ఫ్రాడ్ లింక్‌లపై క్లిక్ చేస్తే నకిలీ వెబ్‌సైట్‌లకు అమాయకులను తీసుకెళ్తున్నదని పేర్కొంది. అక్కడ ఒమిక్రనా్ పీసీఆర్ టెస్టుల కోసం అప్లై చేసుకోవాలని సూచిస్తున్నదని వివరించింది. ఒమిక్రాన్ సంబంధ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తప్పిస్తూ ఈ టెస్టుకు వీలు కల్పిస్తున్నట్టు ఆ వెబ్‌సైట్లు పేర్కొంటాయని తెలిపింది.
ఈ వెబ్‌సైట్‌లలోనే పౌరులు తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఆ వివరాలు సదరు పౌరుడి వ్యక్తిగత, బ్యాంకు సంబంధ సమాచారం అయి ఉండటంతో వాటిని ఆ ఫ్రాడ్‌స్టర్లు సులువుగా చోరీ చేస్తున్నారని పేర్కొంది. తద్వార బ్యాంకుల్లో నుంచి డబ్బులను కాజేస్తున్నారని వివరించింది. కాబట్టి, ఒమిక్రాన్ టెస్టులు ఉచితంగా, ప్రభుత్వ ఆంక్షలకూ అతీతంగా చేస్తామని పేర్కొంటూ మోసాలు చేస్తున్నారని హెచ్చరించింది.
Also Read: ముంబైలో కోవిడ్ -19 ఆంక్షలు: జనవరి 15 వరకు పొడగించిన ప్రభుత్వం
భారత్‌లో ఇప్పటివరకు 1,270 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్తాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16, హర్యానాలో 14, ఒడిశాలో 14, పశ్చిమ బెంగాల్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూ కశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2, ఉత్తరప్రదేశ్‌లో 2, గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 1, పంజాబ్‌లో 1 నమోదయ్యాయి.