రాజీవ్ గాంధీ హంతకుల్లో నలుగురిని శ్రీలంకకు పంపే ఏర్పాట్లు: తమిళనాడు అధికారులు

By Mahesh KFirst Published Nov 15, 2022, 6:02 AM IST
Highlights

రాజీవ్ గాంధీ హంతకుల్లో నలుగురిని శ్రీలంకకు పంపడానికి ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వారి వివరాలను శ్రీలంక ఎంబసీకి పంపారు. ఆ నలుగురి పౌరసత్వాన్ని నిర్దారించిన వెంటనే వారిని శ్రీలంకకు పంపిస్తారు.
 

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుల్లో ఈ నెలలోనే విడుదలైన ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంక వాసులు ఉన్నారు. ఆ నలుగురు శ్రీలంక పౌరులను వారి దేశానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తమిళనాడు అధికారులు సోమవారం తెలిపారు. రాజీవ్ గాంధీ హంతకులను సత్ప్రవర్తన పై విడుదల చేయాలని 2016లో తమిళనాడు ప్రభుత్వం కోరింది. తాజాగా, ఈ నెల 11వ తేదీన వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మరుసటి రోజే వెల్లూరి సెంట్రల్ జైలు నుంచి ఆరుగురు రాజీవ్ గాంధీ హంతకులు విడుదలయ్యారు.

ఆ నలుగురు శ్రీలంక పౌరులను ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తీసుకెళ్లారు. శనివారం సాయంత్రం వారిని త్రిచిలోని స్పెషల్ రిఫ్యూజీ క్యాంప్‌నకు తీసకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే వేలూరు జైలు నంచి విడుదల తర్వాత ఈ శిబిరానికి తీసుకెళ్లినట్టు త్రిచి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Also Read: ఉరిశిక్షకు సిద్ధం కావాలని ఏడు సార్లు ఆదేశాలు.. వారు నాకోసం ఎదురుచూశారు కూడా: నళిని

విదేశాంగ వ్యవహారాల శాఖ పరిధిలోని ఫారీన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తాను ఫోన్ చేసి మాట్లాడినట్టు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. వారు శ్రీలంకన్ ఎంబసీకి ఇందుకు సంబంధించిన వివరాలను పంపించారని వివరించారు. శ్రీలంక ఎంబసీ వారి శ్రీలంక పౌరసత్వాన్ని నిర్ధారించాల్సి ఉన్నదని తెలిపారు. వారు శ్రీలంక పౌరులే అని ఎంబసీ తేల్చాల్సి ఉన్నదని, వారు శ్రీలంక పౌరులే అని వచ్చే నిర్దారణ ద్వారా వారిని ఆ దేశానికి పంపించడానికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ముందుగా విడుదల చేసిన పెరారివాలన్‌తో కలిపి మొత్తం ఏడుగురు బయటకు వచ్చారు. నళిని శ్రీహరన్, మురుగన్ అలియాస్ శ్రీహరన్, సంతాన్, పీ రవి చంద్రన్, రాబర్ట్ పయాస్, ఎస్ జయకుమార్‌లు 1991లో ఈ కేసు కింద అరెస్టు అయ్యారు. నళిని భర్త శ్రీహరన్‌తో కలుపుకుని నలుగురు హంతకులు శ్రీలంక దేశస్తులు.

click me!