
చంద్రశేఖర్ 1947–78 మధ్య భారత్–పాకిస్థాన్ యుద్ధాలు, 1962 చైనా యుద్ధంలో డకోటా DC-3 విమానం నడిపి సైనికులను సరిహద్దుకు తీసుకెళ్లారు. అలాగే 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో కూడా ఆయన సేవలు అందించారు. ముఖ్యంగా 1947లో డకోటా విమానం లేకపోతే కశ్మీర్ ప్రజలను రక్షించడం కష్టమయ్యేదని చెబుతారు.
తన తండ్రి కోరిక మేరకు రాజీవ్ చంద్రశేఖర్ ఐర్లాండ్‌లో అమ్మకానికి ఉన్న డకోటా DC-3 విమానాన్ని కొనుగోలు చేశారు. దానిని 2018లో భారత వైమానిక దళానికి బహుమతిగా అందజేశారు. ఈ విమానానికి గౌరవార్థం ‘పరశురామ’ అని పేరు పెట్టారు.
కార్గిల్ విజయదినం రోజున, బెంగళూరులోని జాతీయ సైనిక స్మారక స్థలంలో 75 అడుగుల ఎత్తైన, 700 టన్నుల బరువున్న వీరగల్ (వీరుల స్మారక రాయి) ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి, పూర్తి కావడానికి చంద్రశేఖర్ కీలకంగా పనిచేశారు. ఆయన కోరిక ప్రకారం ఈ స్మారకం ఏర్పడింది.
ఈ స్మారక స్థలంలో వీరుల పేర్లు చెక్కిన శిల్పాలు, జాతీయ పతాకం, భూగర్భ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇది యువతకు స్ఫూర్తినిస్తూ, వీరమరణం పొందిన సైనికులకు గౌరవం అర్పించే స్థలంగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులకు సాంత్వన కలిగించే ప్రదేశంగా కూడా ఇది ఉండాలని చంద్రశేఖర్ ఆశించారు.
తండ్రి ఇక లేరన్న విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన రాజీవ్.. బ్లూ స్కైస్ అండ్ టెయిల్‌విండ్స్. ఎయిర్ కమాండర్ ఎం.కే. చంద్రశేఖర్, VM, VSM. ఈ రోజు నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కన్నుమూశారు. ఆయన సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. నన్ను మాత్రమే కాక, మరెందరినో ఆయన జీవితం ప్రేరేపించింది. నా ప్రతి అడుగులోనూ ఆయన స్ఫూర్తి, ప్రేమ నాతో ఉంది. ఆయన ఒక వాయుసైనికుడు, దేశభక్తుడు, జెంటిల్మన్. అయితే అంతకన్నా ముఖ్యంగా, నాకు మంచి తండ్రి, మార్గదర్శి, నా పిల్లలకు గొప్ప తాతయ్య. అని రాసుకొచ్చారు.