
ఢిల్లీ: పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సైనికాధిపతి ఎంఎం నరవణే సమకాలిక పరిస్థితులపై స్పందించారు. యుద్ధం అనేది తేలికపాటి విషయమేమీ కాదని, దానిని బాలీవుడ్ సినిమాల్లా ఊహించడం పొరపాటు అని స్పష్టం చేశారు. ఇటీవల విక్రమ్ మిశ్రిపై జరిగిన సైబర్ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
దేశం యుద్ధంలోకి దిగాలంటే అది చివరి ఎంపికగా మాత్రమే ఉండాలన్నారు. రాజకీయంగా అనుభవం లేని కొంతమంది, ఆలోచించకుండా యుద్ధం జరగాలంటూ డిమాండ్ చేయడం అసాధారణంగా ఉందన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు సమాజానికి హానికరం అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి కూడా ప్రస్తుతం యుద్ధానికి ఇది సరైన కాలం కాదని ఇప్పటికే తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు సరైన దిశలోనే ఉన్నాయని నరవణే అభిప్రాయపడ్డారు. యుద్ధం ఒక క్లిష్టమైన ప్రక్రియ. అది అనివార్యమైతే తప్ప దేశం ఆ దిశగా అడుగు వేయదని వివరించారు.