వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న గేదెల యజమానులపై కేసు.. ‘యజమానులను గుర్తించాల్సి ఉన్నది’

By Mahesh KFirst Published Oct 7, 2022, 5:11 PM IST
Highlights

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న గేదెల యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇంకా ఆ యజమానిని గుర్తించాల్సి ఉన్నది. అహ్మదాబాద్‌లోని వాట్వా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గేదెల మందను ఢీకొన్న సంగతి తెలిసిందే. వాట్వా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ట్రైన్.. ఢీకొనడంతో నాలుగు గేదెలు మృతి చెందాయి. అయితే, ట్రైన్ ముందు భాగం కొంత ధ్వంసమైంది. కానీ, దాన్ని గంటల వ్యవధిలోనే సరి చేశారు. తాజాగా, ఇదే ఘటనలో మరో వార్త ముందుకు వచ్చింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో మరణించిన గేదెల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇంకా ఆ యజమానిని గుర్తించలేదు.

ముంబయి సెంట్రల్ - గాంధీనగర్ మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధాని మోడీ ఇటీవలే గుజరాత్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మణినగర్, వాట్వా రైల్వే స్టేషన్‌ల మధ్య ఉదయం 11.18 గంటల ప్రాంతంలో గేదెలను ఈ ట్రైన్ ఢీకొంది.

వెస్ట్రన్ రైల్వే ప్రతినిధి జితేంద్ర కుమార్ జయంత్ ఈ ఘటనపై మాట్లాడుతూ, ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు అడ్డుగా ట్రాక్ పైకి వచ్చిన గేదెలను ఢీకొంది. ఈ గేదెల యజమానుల పై ఆర్‌పీఎఫ్ కేసు నమోదు చేసింది. ఆ యజమానులను ఇంకా గుర్తించాల్సి ఉన్నది’ అని వివరించారు.

Also Read: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సిడెంట్! గేదెలను ఢీకొనడంతో ముందటి భాగం డ్యామేజీ.. నాలుగు గేదెల మృత్యువాత

గురువారం సాయంత్రం ఈ కేసు నమోదు చేసినట్టు వివరించారు. రైల్వే యాక్ట్ 1989లోని సెక్షన్ 147 కింద ఈ కేసు పెట్టారు.

click me!