
ఇండో-పాక్ సంబంధాలపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో చర్చలను ఫరూక్ అబ్దుల్లా సమర్థించారు. శ్రీనగర్‌లో అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌తో చర్చలు జరిగేంత వరకు కాశ్మీర్ సమస్య పరిష్కారం కాదని, ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు లోయలో శాంతి నెలకొనదని అన్నారు. శాంతిభద్రతలు కాపాడకుండా ఇక్కడ హత్యలు ఆగవని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించడం లేదా లోయ అంతటా తిరంగా ర్యాలీలు నిర్వహించడం వల్ల కాశ్మీర్‌లో పరిస్థితి మారిందా ? అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇరు దేశాల నేతలు నిజాయితీతో మెలగాలని సూచించారు. యుద్ధాలు దేనినీ పరిష్కరించలేవనీ, కాబట్టి భారత్-పాకిస్తాన్ స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో మాట్లాడాలని అబ్దుల్లా అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొందని ప్రభుత్వ వాదనలపై ఆయన తోసిపుచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతి ఉంటే.. ఉగ్రవాద చర్యలు ఎందుకు జరుగుతాయి. ? ఎందుకు బుల్లెట్ల వర్షం కురుస్తోంది? ఎందుకు సైనికులు, ప్రజలు చంపబడుతున్నారని ప్రశ్నించారు.
'కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఇంకా ఉంది'
కశ్మీర్‌లో ఉగ్రవాదం ఇంకా ఉంది.. బుల్లెట్లు పేలుతున్నాయి.. ప్రజలు చనిపోతున్నారు.. సైనికులు చనిపోతున్నారు.. నిజంగా శాంతి ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది’’ అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఉక్రెయిన్ యుద్దాన్ని ఉటంకిస్తూ.. అక్కడ ఏం జరిగినా అది ప్రజలందరి ముందు ఉంటుందని ఫరూక్ అన్నారు. యూరప్ నాశనం చేయబడుతోంది, మొత్తం దేశాలు నాశనం చేయబడుతున్నాయని అని కీలక వ్యాఖ్యలు చేశారు.