పార్లమెంటుకు ‘ట్రాక్టర్ మార్చ్’ వాయిదా.. సోమవారమే సాగు చట్టాల రద్దు బిల్లు

By telugu teamFirst Published Nov 27, 2021, 4:50 PM IST
Highlights

రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 29న తలపెట్టాల్సిన పార్లమెంటుకు ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 29వ తేదీనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేస్తామని తమకు హామీ ఇచ్చిందని పేర్కొంటూ ఈ ట్రాక్టర్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా సభ్య నేత దర్శన్ పాల్ వెల్లడించారు. కాగా, సోమవారం పార్లమెంటులో పార్టీ ఎంపీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 

న్యూఢిల్లీ: ఈ నెల 29న Parliamentకు ట్రాక్టర్ మార్చ్(Tractor March) నిర్వహించే కార్యక్రమాన్ని Farmers వాయిదా వేశారు. పార్లమెంటు ఛలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని రైతు నేత డాక్టర్ దర్శన్ పాల్ వెల్లడించారు. ఈ నెల 29వ తేదీనే మూడు సాగు చట్టాల(Farm Laws)ను రద్దు(Repeal) చేస్తామని కేంద్ర ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు. పార్లమెంటుకు ట్రాక్టర్ ర్యాలీపై ఈ రోజు ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా(SKM) సమావేశం అయింది. ఆ తర్వాత రైతు నేత దర్శన్ పాల్ మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన రైతులు పార్లమెంటుకు ర్యాలీ చేపట్టాల్సి ఉన్నది. పార్లమెంటు సమావేశాలు 29వ తేదీనే ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. తాము ట్రాక్టర్ ర్యాలీకి పిలుపు ఇచ్చినప్పుడు మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఇంకా వెలువడలేదని ఈ సందర్భంగా ఆయన దర్శన్ పాల్ గుర్తు చేశారు.

తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశామని, అందులో తమ డిమాండ్లు అన్ని పొందుపరిచామని దర్శన్ పాల్ తెలిపారు. రైతులపై దాఖలైన కేసులను ఎత్తేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వడం, ఈ ఆందోళనలో (లఖింపూర్ ఖేరి ఘటనలో సహా) మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందజేయాలనే డిమాండ్లనూ ప్రధాని మోడీకి లేఖ రాసి తెలియజేశామని అన్నారు. వీటితోపాటు పంట వ్యర్థాలను కాల్చినందుకు పెట్టిన కేసులు, విద్యుత్ బిల్లులనూ రద్దు చేయాలనే డిమాండ్‌నూ వారు ప్రధాన మంత్రి ముందు ఉంచినట్టు తెలిపారు. తాము వీటన్నింటిపై సమాధానం కోసం వచ్చే నెల 4వ తేదీ వరకు ఎదురు చూస్తామని అన్నారు. ఆ తర్వాతే తదుపరి కార్యచరణను ప్రకటిస్తామని వివరించారు. అయితే, తమ ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరిలో, ఢిల్లీ
సరిహద్దులో మరణించిన రైతులపై, కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం తమతో చర్చించడానికి ఒప్పుకునే వరకు తాము తమ ఆందోళనలను కొనసాగిస్తామని వివరించారు.

Also Read: Farm Laws: సాగు చట్టాల రద్దు నిర్ణయం.. ఎన్నికల్లో విపక్షాలకు కలిసి వస్తుందా?

కాగా, ఇదే రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా వారు ఆందోళనలు కొనసాగించడం అర్థరహితమని అన్నారు. సాగు చట్టాల రద్దు మాత్రమే కాదు.. రైతులు లేవనెత్తిన డిమాండ్లపై చర్చించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాబట్టి, రైతులు తమ ఆందోళనలు విరమించుకుని స్వగ్రామాలకు వెళ్లాలని సూచించారు. 

Also Read: రైతుల పక్షాన నిజంగా నిలబడితే.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు: ప్రధానికి ప్రియాంక గాంధీ లేఖ

మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దులో ఏడాది కాలంగా ధర్నా చేస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా తాము తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తామని ఇటీవలే ప్రకటించింది. 29వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ సాగు చట్టాలను రద్దు చేస్తామని తెలిపింది. కాగా, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సాగు చట్టాలను రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీలు అందరూ ఎగువ, దిగువ సభల్లో సోమవారం హాజరవ్వాలని పార్టీ విప్ జారీ చేసింది.

click me!