ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో మనదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ పురోగతిపై చర్చించారు. అంతేకాదు, కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు ఎత్తేసే నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని తెలిపారు. ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
న్యూఢిల్లీ: South Africaలో వెలుగుచూసిన New Variant ఒమిక్రాన్(Omicron)పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూకే, జర్మనీ, ఇటలీ ఈ దేశానికి ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఐరోపా దేశాలన్నీ ఇటువైపుగా అడుగులు వేస్తున్నాయి. కాగా, భారత్ మాత్రం అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరణపై నిన్న ప్రకటన చేసింది. వచ్చే 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించింది. అయితే, ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని, కొత్త వేరియంట్ వెలుగుచూసిన దేశాల నుంచి ప్రయాణాలు నిలిపేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌పై మన దేశంలోనూ ఆందోళనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) కొత్త వేరియంట్‌పై ఉన్నత అధికారులతో సమీక్ష(Review) నిర్వహించారు.
క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, పీకే మిశ్రాలతో ప్రధాని మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఇందులో ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను ప్రధానికి అధికారులు వివరించారు. కొత్త వేరియంట్‌ను ఆందోళనకారక వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం గుర్తించడం, కొత్త వేరియంట్‌తో భారత్, సహా ఇతర దేశాలపై పడే ప్రభావాలనూ ప్రధానికి అధికారులు తెలియజేసినట్టు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో కనిపించింది. కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక సూచనలూ చేశారు.
undefined
Also Read: Omicron: మన దేశంలో మళ్లీ ఆంక్షలు షురూ..! గుజరాత్, ముంబయిలో ‘టెస్టులు, క్వారంటైన్’ ఆదేశాలు
కొత్త వేరియంట్ విజృంభించే ముప్పు ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు ఎత్తేయాలనే నిర్ణయాన్ని సమీక్షించాలనీ ఈ సందర్భంగా ప్రధాని మోడీ సూచనలు చేశారు. ప్రజలూ మరింత జాగ్రత్తగా మసులుకోవాలని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించడంపై జాగ్రత్త వహించాలని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా కరోనా కేసుల రిస్క్ ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.
భారత్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం చేపడుతున్న కృషిని అధికారులు ప్రధాన మంత్రికి తెలిపారు. పలు రకాల వేరియంట్లను భారత్‌లో ఈ పద్ధతిలో గుర్తిస్తున్నట్టు వివరించారు. దీనిపై స్పందిస్తూ విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని ప్రధాని మోడీ సూచించారు. అంతేకాదు, ఈ సీక్వెన్సింగ్ విధాన సేవలను మరింత విస్తృతం చేయాలని అన్నారు. దేశంలో టీకా పంపిణీ గురించీ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ వేగంగా జరుగుతున్నదని అన్నారు. కాగా, ఇప్పటికే తొలి డోసు వేసుకున్న వారికి రెండో డోసు అందించడంపై ఫోకస్ పెట్టాలని ప్రధాని చెప్పారు. ఫస్టు డోసు పొందిన వారందరికీ సకాలంలో రెండో డోసు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని అన్నారు. కరోనా కేసులు అధికంగా రిపోర్ట్ అవుతున్న ప్రాంతాల్లో కట్టడి చర్యలు కఠినం చేయాలని వివరించారు. సర్వెలెన్స్ కూడా పటిష్టంగా చేపట్టాలని అన్నారు. కొవిడ్ క్లస్టర్‌లకు సాంకేతిక సహకారాన్ని సకాలంలో అందించాలని సూచించారు.