
చండీగడ్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలురాష్ట్రాల్లోని రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో ఈ నిరసనలు తీవ్రంగా సాగుతున్నాయి. కేంద్రంలోనూ, హర్యానాలోనూ అధికారంలో బీజేపీ ఉండటంతో ఆందోళనలు ఈ రాష్ట్రంలో అధికంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఎక్కడికెళ్లిన ఆందోళనకారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు.
హర్యానాలో ఇదే రోజు రెండు ఘటనలు ఇలాంటివి చోటుచేసుకున్నాయి. హిసార్ జిల్లాలో బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రాను అడ్డుకోగా, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జాంగ్రా కారు అద్దాలు పగిలిపోయాయి. మరో ఘటన రోహతక్‌లో చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి కేదార్‌నాథ్ పర్యటన లైవ్ టెలికాస్ట్ చూడటానికి మాజీ మంత్రి మనీశ్ గ్రోవర్, ఇతర బీజేపీ నేతలు కిలోయి గ్రామంలోని ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని స్థానికులు, ఇతర రైతు సంఘాల నేతలు గమనించారు.
మాజీ మంత్రి మనీశ్ గ్రోవర్ ఇది వరకు రైతులపై అసభ్యకర భాషను ఉపయోగిస్తూ మాట్లాడినట్టు రైతు నేతలు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పించడానికి వారు ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బీజేపీ ఎంపీ కారు అద్దాలు పగులగొట్టిన రైతు ఆందోళనకారులు.. హర్యానాలో ఉద్రిక్తతలు
గుడిలోకి మాజీ మంత్రి మనీశ్ గ్రోవర్, ఇతర బీజేపీ నేతలు వెళ్లగానే రైతు నేతలు అక్కడికి చేరుకున్నారు. స్థానికులను ఆ ఆలయం చుట్టూ వచ్చి చేరాల్సిందిగా సూచనలు చేశారు. గుడిని దిగ్బంధించి బీజేపీ నేతలు అడుగు బయట పెట్టకుండా చూడాలని అన్నారు. రైతులు, ఇతర గ్రామస్తులు గుడి చుట్టూ గుమిగూడారు. మాజీ మంత్రి సహా ఇతర బీజేపీ నేతలు రవీంద్ర రాజు, మేయర్ మన్మోహన్ గోయల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అజయ్ బన్సల్, పార్టీ నేత సతీశ్ నందల్‌లూ గుడి లోపలే ఉండిపోయారు.
తమను వదిలిపెట్టాల్సిందిగా బీజేపీ నేతలు వారిని అడిగారు. కానీ, వారు విడిచి పెట్టలేదు. చివరికి గ్రోవర్ రైతులుకు క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాతే వారిని వదిలిపెట్టినట్టు రైతులు చెప్పారు.
ఈ విషయం పోలీసులకూ తెలిసింది. ఈ జిల్లా అధికారులు పొరుగు జిల్లాల్లోని పోలీసులనూ స్పాట్‌కు రావాల్సిందిగా అడిగారు. వీరంతా గుడి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యామని వివరించారు.
Also Read: హర్యానా ఎల్లెనాబాద్ ఉపఎన్నికలో ‘రైతుల విజయం’.. ఆరువేల మెజార్టీతో అభయ్ గెలుపు
గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాజీ మంత్రి గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రైతులకు క్షమాపణలు చెప్పలేదని అన్నారు. తాను ఎప్పుడు తలిస్తే అప్పుడు ఇక్కడికి వస్తానని, ఈ గుడిని దర్శించుకుంటానని తెలిపారు. తాను గుడిలో ఉన్నప్పుడు ఓ పెద్ద మనిషి గుడిలోకి వచ్చి తనను కలిశారని వివరించారు. రైతులకు అభివాదం చేయాల్సిందిగా సూచించారని తెలిపారు. అందుకే రైతులకు అభివాదం చేశానని చెప్పారు. కానీ, తాను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు.