అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమయ్యింది. మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిలో కొలువైన రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట పూజలో పాాల్గొననున్నారు.
అయోధ్య : రామ జన్మభూమి అయోధ్యలో నిర్మించిన రామమందిరాన్ని నేడు(సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రామమందిరమే కాదు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. అద్భుత శిల్పసంపదతో సహజంగానే ఆకట్టుకునే రాములోరి కోవెల విద్యుత్ దీపాలు, పూల అలంకరణతో మరింత అందంగా మెరిసిపోతోంది. ప్రస్తుతం అయోధ్య నగరం మొత్తం రామనామ స్మరణతో ఆద్యాత్మక శోభ సంతరించుకుంది.
దేశ విదేశాలకు చెందిన ప్రముఖులంతా ప్రస్తుతం అయోధ్యబాట పట్టారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు ఇతర రంగాలకు చెందినవారు, సాధుసంతులు అయోధ్యకు చేరుకుంటున్నారు. దాదాపు ఏడువేల మందికిపైగా అతిథుల సమక్షంలో ప్రధాని మోదీ అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటల నుండి 1 గంట వరకు గల శుభ ముహూర్తంలో ప్రధాని చేతులమీదుగా ప్రత్యేక పూజలు చేయించనున్నారు పండితులు.
undefined
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామమందిర ప్రారంభోత్సవ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటుచేసారు. పూజా కార్యాక్రమాలు జరిగే ఆలయంవద్దే కాదు నగరం మొత్తం పోలీసుల పహారా కొనసాగుతోంది. పది వేలకు సిసి కెమెరాలు, అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో అయోధ్యలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కేవలం రాష్ట్ర పోలీసులే కాదు కేంద్ర బలగాలు కూడా అయోధ్య భద్రతలో పాలుపంచుకుంటున్నారు.
Also Read అయోధ్యలో రామ మందిరం: రామ్ లల్లా విగ్రహం 51 ఇంచులే ఎందుకు?
ఇక అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు చాలామంది సొంత వాహనాల్లో అయోధ్య వస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలో 51 ప్రాంతాల్లో 20వేలకు పైగా వాహనాలను పార్క్ చేసుకునే ఏర్పాట్లు చేసారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆరు కిలోమీటర్ల దూరంవరకు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ భారీకేడ్లు ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు.
దేశంలోని మెజారిటీ హిందూ ప్రజలు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం జరిగే ఈ రోజు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశంలోని ప్రతి ఊరు, ప్రతి వాడ ఉత్సవాలకు సిద్దమయ్యింది. స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శోభాయాత్రలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ట పూజలను అందరూకలిసి ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. ఇలా కేవలం అయోధ్యలోనే కాదు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, ఊరూ వాడల్లో నేడు పండగ వాతావరణం నెలకొంది.