మహారాష్ట్రలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని శివసేన (యూబీటీ) అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో పాలిటిక్స్ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. 15 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందని ఆదివారం శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.
మహారాష్ట్రలోని జల్గావ్ లో జరిగిన బహిరంగ సభలో ఉద్దవ్ ఠాక్రే ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా జరగొవచ్చని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ‘ఆ తర్వాత ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ ‘షిండే ప్రభుత్వం కూలిపోతుంది’ అంటూ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఉద్దవ్ ఠాక్రే ఈ విధంగా మాట్లాడటం గమనార్హం.
ఇదే సమయంలో ఉద్దవ్ ఠాక్రే ప్రసంగిస్తూ.. ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. మొత్తం 288 సీట్లలో షిండే వర్గానికి 48 సీట్లు మాత్రమే కేటాయిస్తామని ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘ శివసేన చీలిక విభాగమైన షిండే పార్టీకి 48 సీట్లు (మొత్తం 288 సీట్లలో) మాత్రమే కేటాయిస్తామని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే ఇటీవల చెప్పారు. కేవలం 48 స్థానాల్లో పోటీ చేసే వ్యక్తి కింద బీజేపీ ఎన్నికల్లో పోరాడుతుందా ?’’ అని ప్రశ్నించారు.
విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందని, మరో 15-20 రోజుల్లో అది కూలిపోతుందని సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తమ పార్టీ కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తోందని అన్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై షిండే నేతృత్వంలోని శివసేన పాలక వర్గం కూడా స్పందించింది. రౌత్ ను నకిలీ జ్యోతిష్కుడుగా అభివర్ణించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో ఇలాంటి అంచనాలు వేసే నాయకులు చాలా మందే ఉన్నారని పేర్కొంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. యువకుడితో 14 ఏళ్ల బాలిక ప్రైవేట్ చాట్.. ఇంటికి పిలిచి లైంగిక దాడి..
గత ఏడాది జూన్ లో ఏక్ నాథ్ షిండే.. 39 మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశారు, ఫలితంగా పార్టీ చీలిపోయింది. థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం (ఇందులో ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా ఉన్నాయి) కూలిపోయింది. ఆ తర్వాత షిండే బీజేపీతో పొత్తు పెట్టుకొని మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 జూన్ 30వ తేదీన షిండే సీఎంగా, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.