కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ గురువారంనాడు నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు ఈసీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పనౌటీ అనే పదాన్ని ఉపయోగించడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది.ఈ విషయమై ఈసీకి ఫిర్యాదు చేసింది. అంతేకాదు తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ. 14లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని బీజేపీ గుర్తు చేసింది. బీజేపీ ఫిర్యాదు మేరకు ఈ నెల 25న విచారణకు రావాలని రాహుల్ గాంధీని ఈసీ ఆదేశించింది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను ఈసీ నోటీసులు పంపింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రపంచకప్ ఫైనల్ పోటీల్లో అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ స్టేడియానికి రావడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ స్టేడియానికి రావడం వల్లే భారత జట్టు ఓటమి పాలైందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోందని ప్రధాన మంత్రి మోడీ రాజస్థాన్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మహిళలపై నేరాలు, అవినీతి సహా పలు అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ విమర్శలు గుప్పించారు. రెడ్ డైరీ, మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులతో రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
also read:Telangana assembly elections 2023: సీఎం పదవిపై రేవంత్ రెడ్డికి అనుకూలంగా మల్లు రవి, విభేదించిన భట్టి
2019 ఎన్నికల సమయంలో కూడ నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సభలో మోడీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి శిక్ష విధించింది. అయితే ఈ విషయమై రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది.