పండుగ రోజున వరుస భూకంపాలు.. అసోం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్‌లలో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు

By telugu team  |  First Published Nov 4, 2021, 2:16 PM IST

దీపావళి పండుగ సందర్భంగా దేశంలో వరుస భూకంపాలు సంభవించాయి. హిమాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్‌లలో గురువారం ఉదయం భూంకంపాలు వచ్చాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ప్రాణనష్టం జరిగినట్టు రిపోర్టులు రాలేవు.
 


న్యూఢిల్లీ: దీపావళి పండుగ రోజున దేశంలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈశాన్య  రాష్ట్రాలు అసోం, మణిపూర్ సహా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రోజు భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు ఉదయం భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం భూమి రెండు సార్లు కంపించింది. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.5గా నమోదైంది. మరోసారి ఉదయం 7.15 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 2.4గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) పేర్కొంది. 

Earthquake of Magnitude:3.7, Occurred on 04-11-2021, 10:19:08 IST, Lat: 26.59 & Long: 92.44, Depth: 25 Km ,Location: 35km WSW of Tezpur, Assam, India for more information download the BhooKamp App https://t.co/sfm7tUwYNx pic.twitter.com/YLPRFSUBdG

— National Center for Seismology (@NCS_Earthquake)

Latest Videos

కాగా, అసోంలో ఉదయం 10.19 గంటల ప్రాంతంలో 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అసోం రాజధాని గువహతి సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. సోనిత్‌పూర్ జిల్లా తేజ్‌పూర్ పట్టణానికి దక్షిణాన 35 కిలోమీటర్ల దగ్గర 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఇప్పటి వరకైతే ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్టు రిపోర్టులు రాలేవు.

మణిపూర్‌లోనూ భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారని అధికారులు తెలిపారు. మొయిరాంగ్ సమీపంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఎన్‌సీఎస్ వెల్లడించింది. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: Earthquake: జార్ఖండ్, అసోంలలో వెంటవెంటనే భూకంపాలు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగెత్తిన జనం

ఈ రోజు దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రజలంతా సంబురాలు చేసుకుంటున్నారు. కానీ, వరుస భూకంపాలు కలవరం కలిగిస్తున్నాయి.

గత నెల 3వ తేదీన జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో భూకంపాలు కలకలం రేపాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కొద్ది వ్యవధి తేడాతో భూకంపం సంభవించింది. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారు. తొలుత జార్ఖండ్‌లోని సింగ్‌భమ్‌లో మధ్యాహ్నం 2.22 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం ప్రకంపనలు పది కిలోమీటర్ల లోతు కనిపించాయని వివరించింది.

click me!