
Jammu Kashmir earthquake: జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం (ఏప్రిల్ 30) తెల్లవారుజామున 4.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఉదయం 5.15 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. అక్షాంశం-రేఖాంశాలు వరుసగా 35.06, 74.49గా నివేదించబడ్డాయి. భూకంపం తీవ్రత 4.1 గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. ఐదు కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.
ఇదిలావుండగా, ఈ ప్రాంతం అధిక భూకంప జోన్లలో ఉన్నందున.. వరద నష్టాలు ఎక్కువగా ఉండటంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి మొత్తం 20 జిల్లాల్లో అత్యాధునిక అత్యవసర ఆపరేషన్ సెంటర్లను (ఈవోసీ) ఏర్పాటు చేయాలని జమ్మూ కాశ్మీర్ పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది.
జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (ఎన్డీఎంపీ) 2019 కింద పూర్తి విపత్తు నిర్వహణ ప్రణాళికను కలిగి ఉన్న బుద్గాం జిల్లాలో ఈఓసీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది అన్ని జిల్లాల్లో అమలు చేయబడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. డయల్ నంబర్ 112లో విపత్తు కాల్స్ ను సమన్వయం చేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (ఈఆర్ ఎస్ ఎస్ ) అమలు కోసం భారత ప్రభుత్వ ఎన్ డీఎంఏతో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.