
Man Posing As Gujarat Official-Raping Model: ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిగా నటిస్తూ.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోడల్ పై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. నిందితుడు విరాజ్ పటేల్ ను శనివారం అరెస్టు చేశామనీ, ఒకరితో గొడవపడి వడోదరలోని పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో అతని నిజస్వరూపం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారిగా, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ) ప్రెసిడెంట్ గా నటిస్తూ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోడల్ పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు విరాజ్ పటేల్ ను శనివారం అరెస్టు చేశామనీ, ఒకరితో గొడవపడి వడోదరలోని పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో అతని అసలు గుర్తింపు వివరాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. మల్టీప్లెక్స్ లో ఒకరితో గొడవకు దిగడంతో ఆ వ్యక్తిని అతనితో పాటు వచ్చిన మోడల్ ను శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
తాను సీఎంవో అధికారిననీ, మహిళతో కలిసి సినిమా చూసేందుకు వచ్చానని నిందితుడు తొలుత పోలీసులకు చెప్పాడు. గిఫ్ట్ సిటీకి తాను అధ్యక్షుడినని కూడా చెప్పుకున్నాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవీ కట్కడ్ తెలిపారు. అనుమానం వచ్చిన పోలీసులు అతని గుర్తింపును తనిఖీ చేయగా, అతను తన పాన్ కార్డుపై వేరే ఇంటిపేరును ఉపయోగించాడనీ, అతని ఆధార్ కార్డులో ఇంటిపేరు లేదని కనుగొన్నారు. ఈ క్రమంలోనే విచారించగా తాను సీఎంవోలో పనిచేయడం లేదని, గిఫ్ట్ సిటీకి అధ్యక్షుడిగా లేనని పటేల్ వెల్లడించాడు.
కాగా, నిందితుడి నిజస్వరూపం వెలుగులోకి రావడంతో గిఫ్ట్ సిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని అతనితో పాటు వచ్చిన ముంబయికి చెందిన మోడల్ చెప్పిందని కట్కడ్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో అతను గాంధీనగర్ వాసి అని తేలిందనీ, ఈ కేసు తదుపరి దర్యాప్తును సిటీ క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించామని ఏసీపీ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 170 (ప్రభుత్వ ఉద్యోగిగా నటించడం), 417 (మోసం), 467 (ఫోర్జరీ), 376 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.