New Delhi: కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎయిమ్స్ లో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Union Minister G Kishan Reddy admitted in AIIMS: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్పించారు. వార్తా సంస్థ పీటీఐ నివేదికల ప్రకారం.. మంత్రి ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేరారు. ఆదివారం రాత్రి 10.50 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తీసుకొచ్చారు. కిషన్ రెడ్డి కార్డియో న్యూరో సెంటర్ లోని కార్డియాక్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' దేశ వారసత్వం, చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. దేశ రాజధానిలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో రేడియో కార్యక్రమం 100వ ఎపిసోడ్ ను పురస్కరించుకుని 'జన్ శక్తి: ఎ కలెక్టివ్ పవర్' ఎగ్జిబిషన్ ప్రారంభ సభలో ఆయన ప్రసంగించారు.
శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గంగా పుష్కర యాత్ర పూరీ-కాశీ-అయోధ్య భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ గౌరవ్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా దేశ, విదేశాలకు చెందిన యాత్రికులకు అద్భుతమైన చారిత్రక ప్రదేశాలను సందర్శించే గొప్ప అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోందన్నారు.
శనివారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగా కనిపించారు. జూన్ 10 నుంచి 18 వరకు హరిద్వార్-రిషికేశ్ నుంచి మాతా వైష్ణోదేవి వరకు భారత్ గౌరవ్ టూరిజం రైలు పర్యాటకులను తీసుకువెళుతుందని తెలిపారు. "ఈ రైలులో ప్రయాణీకులకు తగిన సౌకర్యాలు కల్పించారు. ఈ సదుపాయం ద్వారా పర్యాటకులకు దేశ సంస్కృతిని దగ్గరగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ చొరవ పర్యాటకాన్ని కూడా పెంచుతుంది" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు దశల్లో యాత్రలు నిర్వహించారు. మూడో దశ యాత్ర కొనసాగుతుండగా, నాలుగు, ఐదో విడత యాత్రలను ప్రకటించారు.