అండమాన్ నికోబార్ దీవుల్లో మ‌రోసారి భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జ‌నం.. 

By Rajesh KFirst Published Sep 3, 2022, 11:46 AM IST
Highlights

అండమాన్ నికోబార్ దీవుల్లో 24 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది. 
 

అండమాన్ నికోబార్ దీవులలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో రెండుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభ‌వించడంతో భయాందోళనకు గురిచేశాయి. 

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. పోర్ట్‌బ్లేర్‌కు తూర్పు-ఈశాన్యంగా 106 కి.మీ దూరంలో ఉదయం 6.59 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్‌ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. భూకంపం లోతు భూమికి 70 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ఈ  భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ప్ర‌జ‌లందరూ నిద్రలో ఉండగా.. భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దీవిలోని అన్ని ప్రాంతాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.  రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రతతో కూడిన భూకంపం ప్రాణాంతకంగా పరిగణించబడదు. అయితే.. భూకంప కేంద్రం తక్కువ లోతులో, సముద్ర ప్రాంతాలకు ద‌గ్గ‌ర‌గా ఉంటే..ప్రమాద తీవ్ర‌త పెరుగుతుంది. 24 గంటల్లో.. ఒకే ప్రాంతంలో రెండో సారి భూప్రకంపనలు సంభ‌వించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు అధికారులు నివేదించలేదు. భూకంపం వల్ల ఏమైనా నష్టం జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు అన్ని ప్రాంతాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

భూకంపానికి కారణం ఏమిటి? 

భూమి ప్రధానంగా నాలుగు పొరలతో రూపొందించబడింది. ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్.
క్రస్ట్ మరియు ఎగువ మాంటిల్ కోర్ ను లిథోస్పియర్ అంటారు. ఇందులో 50-కిమీ-మందపాటి పొరను టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్లు.. వాటి స్థానాల్లో కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్ల కదిలిక‌లు ఏర్పడిన‌ట్టు.. భూప్రకంపనలు సంభ‌విస్తాయి. అదే.. సముద్రంలో భూకంపం సంభవించినప్పుడు ఎత్తైన, బలమైన అలలు ఏర్పడుతాయి.  దీనినే సునామీ అని కూడా పిలుస్తారు.

భూకంపం తీవ్రతను ఎలా కొలుస్తారు?

భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేల్ ఉపయోగించబడుతుంది. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు. భూకంపాలను రిక్టర్ స్కేలుపై 1 నుండి 9 వరకు కొలుస్తారు. భూకంపాన్ని దాని కేంద్రం నుండి అంటే భూకంప కేంద్రం నుండి కొలుస్తారు.

click me!