Prime Minister Narendra Modi : తన పేరు ముందు, వెనకా ఎలాంటి గౌరవ పదాలు చేర్చవద్దని ప్రధాని మోడీ బీజేపీ ఎంపీలకు సూచించారు. తనను ‘MODI’ అని మాత్రమే పిలవాలని, ‘MODI JI’ అని పిలవకూడదని విజ్ఞప్తి చేశారు.
PM Narendra Modi : మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ వింగ్ గురువారం సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులందరూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆ పార్టీ సభ్యులకు ఓ విజ్ఞప్తి చేశారు. తనను ఎవరూ ‘మోడీ జీ’ అని పిలవొద్దని అన్నారు. ‘మోడీ’ అని పిలిస్తే చాలని వినయంగా కోరారు.
కాంగ్రెస్, ఇతర పార్టీల కంటే అధికారాన్ని నిలుపుకోవడంలో బీజేపీ మెరుగ్గా ఉందని అన్నారు. కాబట్టి అందుకే పాలన కోసం ప్రజలు తమ పార్టీని ఇష్టంగా ఎంచుకుంటున్నారని దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను ఉదహరిస్తూ చెప్పారు. తనను దేశంలోని సామాన్య ప్రజలు కుటుంబ సభ్యుడిలా భావిస్తారని అన్నారు. కాబట్టి ‘శ్రీ’, ‘ఆదరణీయ’, ‘జీ’ వంటి పదాలు నా పేరు ముందు, వెనకా చేర్చవద్దని కోరారు.
ఇలాంటి గౌరవ పదాలు వాడటం వల్ల ప్రజలకు, తనకు మధ్య దూరం పెరిగినట్టు అనిపిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. తాను బీజేపీలో ఓ సాధారణ కార్యకర్తనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి టీమ్ స్పిరిట్, సమిష్టి బలం కారణమని ప్రధాని మోడీ అన్నారు. మిజోరంలో పార్టీ బలం రెట్టింపు అయిందని, తెలంగాణలో బహుళ రెట్లు పెరిగిందని తెలిపారు.
కేసీఆర్ కు గాయం.. త్వరగా కోలుకోవాలన్న ప్రధాని మోడీ..
ఉచిత రాజకీయాల జోలికి పోకుండా సుపరిపాలన, సేవలను అందిస్తున్నాని ప్రధాని తెలిపారు. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 55-60 సీట్లు అధనంగా గెలుచుకుందని చెప్పారు. కాగా.. అంతకు ముందు ప్రధాని మోడీ ఈ సమావేశ సభాస్థలికి చేరుకోగానే ఉభయ సభలకు చెందిన పార్టీ సభ్యులు ఒక్క సారిగా లేచి నిలబడ్డారు. కరతాళ ధ్వనుల మధ్య పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనను శాలువా, పూలమాలలతో సత్కరించారు.