అధికారాన్ని కశ్మీర్ నుంచి జమ్మువైపు తరలించడమే.. నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదాపై భగ్గుమన్న పార్టీలు

Published : Dec 21, 2021, 12:05 AM ISTUpdated : Dec 21, 2021, 12:10 AM IST
అధికారాన్ని కశ్మీర్ నుంచి జమ్మువైపు తరలించడమే.. నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదాపై భగ్గుమన్న పార్టీలు

సారాంశం

జమ్ము కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషన్ డ్రాఫ్ట్ ప్రతిపాదన దుమారం రేపింది. జమ్ముకు ఆరు సీట్లు, కశ్మీర్‌కు ఒక సీటు అదనంగా కేటాయించే ప్రతిపాదన ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. ఇది కేవలం అధికారాన్ని కశ్మీర్ నుంచి జమ్ముకు తరలించే కుట్ర అని ఆరోపణలు వస్తున్నాయి. 

శ్రీనగర్: జమ్ము కశ్మీర్(Jammu Kashmir)..  యావత్ దేశానికి ఉత్కంఠను కలిగించే, ఆసక్తిదాయకమైన అంశం. అతి సున్నితమైన ప్రాంతం. మెజార్టీ హిందువుల దేశంలో మెజార్టీ ముస్లింల రాష్ట్రంగా అది వెలుగొందింది. అలాంటి జమ్ము కశ్మీర్ గురించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఒక డ్రాఫ్ట్ రిపోర్టు ఇప్పుడు చర్చనీయ అంశమైంది. కొత్తగా జమ్ముకు ఆరు, కశ్మీర్ ఒక్క నియోజకవర్గాలను అధికంగా కేటాయించాలనే ప్రతిపాదన ఇప్పుడు దుమారం రేపింది. సోమవారం ఢిల్లీలో జరిగిన డీలిమిటేషన్ కమిషన్(Delimitation Commission) సమావేశంలో అసోసియేట్ సభ్యులుగా పాల్గొన్న ఐదుగురు జమ్ము కశ్మీర్ ఎంపీలకు ఆ డ్రాఫ్ట్ కాపీని అందించారు. దీంతో ప్రతిపాదన(Proposal) వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిపాదన అధికారాన్ని కశ్మీర్ నుంచి జమ్ముకు తరలించే కుట్ర అని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఈ ప్రతిపాదనను జమ్ము కశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం 370, 35ఏ అధికరణలను 2019 ఆగస్టులో పార్లమెంటు రద్దు చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అధికారం జమ్ము కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కానీ, కీలకమైన అధికరణాల రద్దుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడుతున్నది. జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల విభజన ఉంటుందని ఈ కమిషన్ ఓ నోట్‌లో తెలిపింది.

Also Read: మన హక్కులు తిరిగి పొందడానికి రైతుల తరహాలోనే త్యాగాలు అవసరం: ఫరూఖ్ అబ్దుల్లా

జమ్ము కశ్మీర రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్ము ప్రావిన్స్ నుంచి 37 సీట్లు, కశ్మీర్ ప్రావిన్స్ నుంచి 46 సీట్లు, లడాఖ్ నుంచి నాలుగు సీట్లు ఉండేవి. తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రాఫ్ట్‌తో ఈ సంఖ్య జమ్ములో 43 సీట్లకు పెరగ్గా.. కశ్మీర్‌లో సీట్ల సంఖ్య 47కు చేరుకుంటుంది. జనాభా ప్రకారం కూడా ఓ పరిశీలన చేయవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం, జమ్ము కంటే కశ్మీర్‌లోనే సుమారు 15 లక్షల జనాభా ఎక్కువగా ఉన్నది. జమ్ములో 53.5 లక్షల జనాభా ఉండగా, కశ్మీర్‌లో 68.8 లక్షల జనాభా ఉన్నది. తాజా డ్రాఫ్ట్ వివరాలను జనాభా లెక్కన సీట్లను గణిస్తే.. కశ్మీర్‌లో 1.46 లక్షల మందికి ఒక సీటు ఉండగా, జమ్ములో 1.25 లక్షల మందికే ఒక సీటు కేటాయించినట్టు అవుతుంది.

Also Read: కశ్మీర్‌లోని హిందూ, బౌద్ధ చారిత్రక కట్టడాలపై సర్వే పూర్తి.. అంతర్జాతీయ గుర్తింపునకు ప్లాన్

ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ పార్టీలు తాజా డ్రాఫ్ట్‌పై తీవ్ర అసహనంతో ఉన్నాయి. తమ పార్టీ ఈ డ్రాఫ్ట్‌ను వ్యతిరేకిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ నెల 31న అధికారిక ప్రకటనతో దీనిపై స్పందిస్తామని వివరించారు. ఎంపీలు కేవలం డీలిమిటేషన్ కమిషన్‌లో అసోసియేట్ సభ్యులుగా మాత్రమే ఉంటారు. వారి అభిప్రాయాలను కమిషన్ పరిగణించాల్సిన పని లేదు. కాగా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో దీనిపై స్పందించారు. జమ్ము కశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ డ్రాఫ్ట్‌ను ఆమోదయోగ్యం కాదని, 2011 జనాభా ప్రకారం, జమ్ముకు ఆరు సీట్లు వెళ్లి.. కశ్మీర్‌కు ఒకే సీటు కేటాయించడం హేతుబద్ధం కాదని వివరించారు. ఈ కమిషన్ కేవలం బీజేపీకి పని చేయడానికి ఏర్పాటు చేయబడిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ధ్వజమెత్తారు. మతాలు, ప్రాంతాల ఆధారంగా ప్రజల విడగొడుతున్నదని ఆరోపించారు. ఆగస్టు 2019లో తీసుకున్న అక్రమ నిర్ణయాలను సమర్థించే ప్రభుత్వాన్ని జమ్ము కశ్మీర్‌లో ఏర్పాటు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదని ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం
Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?