ఢిల్లీ కారు ప్రమాదం : కుటుంబానికి ఆ యువతే ఆధారం.. 8యేళ్ల క్రితం తండ్రి మృతి.. నలుగుర్ని పోషించే బాధ్యత ఆమెపై..

By SumaBala BukkaFirst Published Jan 3, 2023, 11:09 AM IST
Highlights

ఢిల్లీ కారు ప్రమాద ఘటనలో మరణించిన యువతే ఆమె కుటుంబానికి ఆధారం. ఆమె తల్లి, ముగ్గురు తనకంటే చిన్నవాళ్లను పోషించే బాధ్యతను చిన్నతనంలోనే తన భుజాలపై వేసుకుందని సమాచారం.

న్యూఢిల్లీ : ఆదివారం తెల్లవారుజామున ఓ కారు స్కూటీని ఢీ కొట్టి.. కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో 20 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆ యువతి మృతి మీద అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఆమె కుటుంబానికి ఆమె ఆధారం. తండ్రి ఎనిమిదేళ్ల క్రితం చనిపోవడంతో.. సంపాదిస్తున్న వ్యక్తి ఆమె ఒక్కతే.. 

బాధితురాలికి తల్లి, ఇద్దరక్కలు.. ముగ్గురు తనమీద ఆధారపడిన చెల్లెల్లు, తమ్ముడు ఉన్నారు. ఇద్దరు అక్కలకు వివాహాలయ్యాయి. మరో ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు నాలుగు, ఏడు, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఆమె తండ్రి దాదాపు ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. కిడ్నీ పేషెంట్‌గా ఉన్న తల్లి ఓ ప్రైవేట్ స్కూల్‌లో డొమెస్టిక్ హెల్పర్ గా పనిచేసేది. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయింది. 

దీంతో కుటుంబానికి వేరే ఆదాయ మార్గం లేకపోవడంతో 8వ తరగతి వరకు చదివిన ఆ మహిళ ఉద్యోగం వెతుక్కోవలసి వచ్చింది. దీంతో ఈవెంట్స్‌లో సహాయక సిబ్బందిగా పనిచేయడం ప్రారంభించింది. అయితే, ఆదివారం దారుణ ఘటన తరువాత.. సోమవారం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలున్నాయన్నారు.

యాక్సిడెంట్ కాదు ఉద్దేశపూర్వకమే.. ఢిల్లీ యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో ప్రత్యక్షసాక్షి సంచలన విషయాలు..

‘‘నా కూతురు ఇన్నర్, టీ షర్ట్, జాకెట్, ప్యాంటు వేసుకుని ఉంది.. కానీ ఘటన తరువాత ఆమె శరీరంపై ఒక్క గుడ్డ కూడా కనిపించలేదు.. ఎముకలు కనపడుతున్నాయని, కాళ్లు పోయాయని విన్నాను. నిందితులు ఆమె మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు" అని మహిళ తల్లి ఆరోపించింది. ప్రమాదం జరిగితే అనుమానితులు ఆమెను ఆస్పత్రికి తరలించి ఉండేవారని ఆమె బంధువులు పేర్కొన్నారు. "శరీరం పరిస్థితిని బట్టి ఆమె లైంగిక వేధింపులకు గురైందని చూపిస్తుంది" అని ఆమె మామ ఆరోపించాడు, "మేము ఈ విషయంలో సరైన విచారణ జరిపించాలని, మా కుమార్తెకు న్యాయం చేయాలనుకుంటున్నాం" అన్నారు.

ఆ మహిళ చివరిసారిగా  తన తల్లితో శనివారం రాత్రి ఫోన్‌లో మాట్లాడింది. "ఆమె సాయంత్రం 6.30 గంటలకు పనికి బయలుదేరింది. ఇంటికి ఎప్పుడు వస్తావని అడగడానికి నేను రాత్రి 9 గంటలకు ఆమెకు ఫోన్ చేశాను. తెల్లవారుజామున 4 గంటల వరకు వస్తానని ఆమె నాతో చెప్పింది. అప్పటికి ఆమె పని ప్రారంభించి కేవలం రెండు గంటలే అయిందని చెప్పింది" అని తల్లి చెప్పింది. యువతి కుటుంబం వాయువ్య ఢిల్లీలోని కరణ్ విహార్‌లో నివసిస్తోంది. 

శనివారం రాత్రి 10 గంటలకు, ఆదివారం ఉదయం 6 గంటలకు తన కుమార్తెకు మళ్లీ కాల్ చేసానని, అయితే ఆమె మొబైల్ ఫోన్ ఆ రెండుసార్లూ స్విచ్ ఆఫ్ చేయబడి ఉందని తల్లి పేర్కొంది."ఆదివారం ఉదయం 7 గంటలకు పోలీసుల నుండి ఫోన్ వచ్చింది. ఆ స్కూటీ మాదేనా, కాదా అని అడిగారు. ఆ సమయంలోనే నా కూతరుకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి.. నన్ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నా కుమార్తెను కలవడానికి కాసేపు వెయిట్ చేయాలని చెప్పారు. 

నాకు కంగారు ఎక్కువై మా తమ్ముడికి ఫోన్ చేసి పిలిచాను, పోలీసులు ఆమె మరణం గురించి తరువాత అతనికి చెప్పారు. వారు ఆమె మృతదేహాన్ని నాకు చూపించలేదు, ”అని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.  సోమవారం ఉదయం ఆమె తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరింది.

click me!