రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోతో డీప్ ఫేక్ పై చర్చ జరుగుతున్నది. డీప్ ఫేక్ అంటే ఏమిటీ? దాన్ని ఎలా గుర్తుపట్టాలి? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది.
Deepfakes: ఈ వారంలో సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ నటి రష్మిక మందన్నా స్పోర్ట్స్‌వేర్ ధరించి ఓ ఎలెవేటర్‌లోకి ప్రవేశిస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చను లేవదీసింది. కొందరు ఆమె ధరించిన ఔట్‌ఫిట్‌ను విమర్శించగా.. మరికొందరు మాత్రం ఆమె దుస్తుల ఎంపిక హక్కును సమర్థించారు.
ఇదంతా ఒక వైపు జరుగుతుండగా.. మరో విస్మయకర కోణం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ వీడియో వాస్తవం కాదని, ఒక డీప్‌ఫేక్ అని తేలింది. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ బ్రిటీష్ ఇండియన్ గర్ల్ జారా పటేల్‌కు చెందిన వీడియో. కొందరు దుండగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అప్లికేషన్ ద్వారా మందన్నా ఫేస్‌ను జారా పటేల్ ముఖానికి తగిలించారు. ఈ వీడియో చూసి మందన్నా షాక్ అయ్యారు. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
దీంతో యూజర్ ప్రైవసీ గురించి ఆందోళన వ్యక్తమైంది. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. డీప్‌ఫేక్స్ అనేవి చాలా ప్రమాదకరమైన అసత్య ప్రచార సాధనాలు అని వివరించారు. ఈ సమస్యలను కచ్చితత్వంతో ఎదుర్కోవాలని తెలిపారు.
డీప్ ఫేక్ అంటే ఏమిటీ?
డీప్‌ఫేక్ అనేది మల్టీమీడియా కంటెంట్. అందులో ఒక వ్యక్తి ముఖాన్ని లేదా బాడీని మరో వ్యక్తిగా చూపిస్తుంది. 2014లో దీన్ని సింథటిక్ మీడియాగా పిలుచుకునేవారు. 2017లో రెడ్డిట్ యూజర్ ఇలాంటి వీడియోలను చేసి డీప్‌ఫేక్ పేరుతో ప్లేలిస్టులో అప్‌లోడ్ చేశాడు. అప్పటి నుంచి డీప్‌ఫేక్ అనే పేరు స్థిరపడింది.
తొలుత డీప్ ఫేక్ హాస్యభరిత వీడియోలకే ఉపయోగించారు. మలయాళం, మమ్మూట్టి, ఫాహద్ ఫాజిల్‌లను గాడ్ ఫాదర్ సినిమాలో పాత్రలకు పెట్టారు. ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అయింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే.. ఈ వీడియోలను గుర్తించగలిగేలా ఉన్నాయి. కానీ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వీడియోలను మరింత మెరుగుపరిచాయి. నకిలీ వీడియోను గుర్తించడం కష్టంగా మారింది.
Also Read: రేపు ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
డీప్‌ఫేక్ ఎలా కనిపెట్టాలి?
- డీప్ ఫేక్ వీడియోను కనిపెట్టాలంటే.. వీడియో స్టార్టింగ్‌లో శ్రద్ధగా చూడాలి. వీడియో తొలి సెకండ్లలోనే నకిలీ వీడియో డీప్ ఫేక్ వీడియోగా మారే దృశ్యాలను జాగ్రత్తగా చూస్తే కనిపెట్టవచ్చు. ఉదాహరణకు రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోలోనూ తొలి సెకండ్లలో జారా ముఖమే కనిపిస్తుంది.
- ఆ వీడియో ఆద్యంతం జాగ్రత్తగా పరిశీలించాలి. సక్రమ కదలికలు అందులో కనిపించవు. ముఖ కవళికలు, కదలికలు కూడా అసమంజసంగా కనిపిస్తాయి.
- డీప్ ఫేక్ వీడియోలో లిప్ సింగ్ సరిగా కాదు. ఆడియో లేదా వీడియోలోనూ మైనర్ గా సింక్ ఉండదు.
- బాడీ పోశ్చర్‌లోనూ వాస్తవ వ్యక్తి ప్రవర్తనకు భిన్నంగా కనిపిస్తుంది.
- ఎప్పుడైనా వీడియో సోర్స్‌ను చెక్ చేయాలి. అదే కంటెంట్ గురించి సెర్చ్ ఇంజిన్‌లోనూ వెతకాలి. అప్పుడు ధ్రువీకరించుకోవాలి.
- ఆన్‌లైన్ టూల్స్ సెంటినెల్, వీ వెరిఫై, రియాలిటీ డిఫెండర్, న్యూస్‌గార్డ్ మిస్‌ఇన్ఫర్మేషన్ ఫింగర్‌ప్రింట్స్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. అయితే..ఇవన్నీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు.