వక్ఫ్ సవరణ చట్టం 2025 పై ఓవైపు కొందరు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేేస్తుంటే... మరికొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా దావూదీ బోహ్రా సమాజం ప్రధాని మోడీని కలిసి, తమ చిరకాల కోరిక తీరిందని సంతోషం వ్యక్తం చేసింది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్'పై నమ్మకం ఉంచారంటూ ప్రధానిని ప్రశంసించారు. .
Dawoodi Bohra leaders meet PM Modi : వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా దావూదీ బోహ్రా సమాజంలో సంతోషం వెల్లివిరిసింది. గురువారం ఈ ముస్లిం సమాజ ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వక్ఫ్ బోర్డు సంస్కరణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టం తమ చిరకాల కోరిక అని, దాన్ని ఇప్పుడు నెరవేర్చారని వారు అన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం వల్ల వక్ఫ్ ఆస్తులపై పారదర్శకత పెరుగుతుంది, వివాదాలు తగ్గుతాయి, అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయవచ్చని బోహ్రా ప్రతినిధులు ప్రధానికి తెలిపారు. ముస్లిం మైనారిటీల హక్కులను కాపాడే దిశగా ఇది కీలకమైన చర్య అని సమాజం పేర్కొంది.
ప్రధాని నాయకత్వం, ఆయన అభివృద్ధి దృక్పథంపై నమ్మకం ఉంచిన దావూదీ బోహ్రా సమాజ సభ్యులు, 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' అనే భావనపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ఈ చట్టం ఆ విశ్వాసానికి నిదర్శనం అని వారు పేర్కొన్నారు.
వక్ఫ్ చట్ట సవరణ కోసం చాలా దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోలేదని సమాజ పెద్దలు తెలిపారు. మోడీ ప్రభుత్వం మాట విని, దానిపై చర్యలు తీసుకుందని... దీంతో ప్రధాని నాయకత్వంలో తమ భవిష్యత్తుపై ఆశావహంగా ఉన్నామని వారు అన్నారు.
దావూదీ బోహ్రా సమాజం ప్రధాని మోడీతో సంబంధాలు కొనసాగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబై, ఇండోర్, కైరోలలో జరిగిన బోహ్రా కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొని, సమాజంతో బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు.
మోడీ ప్రభుత్వం పార్లమెంటులో వక్ఫ్ సవరణ చట్టం 2025ను ఆమోదింపజేసింది. పార్లమెంటు ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. చట్టం అయిన తర్వాత వక్ఫ్ సవరణ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా కొత్త నియామకాలు, డినోటిఫికేషన్ వంటి మార్పులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.