
కశ్మీర్ తమకు జీవనాడి వంటిదని పాకిస్థానీ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను ఖండించారు. కశ్మీర్‌తో పాకిస్థాన్‌కు ఉన్న ఏకైక సంబంధం అక్రమంగా ఆక్రమించుకోవడమే... ఈ భూభాగాన్ని ఆ దేశం ఖాళీ చేయాల్సిందేనని విదేశాంగ శాాఖ స్పష్టం చేసింది.
"విదేశీ వస్తువు మీ జీవనాడి ఎలా అవుతుంది? ఇది భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. పాకిస్థాన్‌తో కశ్మీర్ కు ఎలాంటి సంబంధంలేదు... ఇది కేవలం ఆక్రమించబడిన ప్రాంతమే తప్ప ఆ దేశ భూభాగం కాదు'' అని రంధీర్ జైస్వాల్ అన్నారు.
కశ్మీర్ అనేది పాకిస్థాన్ కు జీవనాడి అని... ఇది ఎప్పటికీ తమదేనని పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ అన్నారు. పాకిస్థాన్ లో కశ్మీర్ ఓ భాగం అన్నట్లుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. అలాగే 1947లో మతపరంగా జరిగిన దేశ విభజనను కూడా ఆయన సమర్థించారు.
విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీల గురించి మునీర్ మాట్లాడుతూ... వారు దేశానికి రాయబారులని అన్నారు. వారు "ఉన్నతమైన భావజాలం, సంస్కృతి"కి చెందినవారని మర్చిపోకూడదని అన్నారు. “మీ పిల్లలకు పాకిస్థాన్ కథను తప్పకుండా చెప్పాలి. మన పూర్వీకులు హిందువులతో ప్రతి అంశంలోనూ భిన్నంగా ఉన్నామని భావించారు. మన మతాలు, మన ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు భిన్నమైనవి. అదే ద్విజాతి సిద్ధాంతానికి పునాది” అని మునీర్ పేర్కొన్నారు.
స్వాతంత్య్రానికి ముందు సంవత్సరాల్లో ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేసిన ఉద్యమానికి ద్విజాతి సిద్ధాంతం ఆధారం. ఈ ఉద్యమానికి పాకిస్థాన్ మొదటి గవర్నర్ జనరల్ అయిన ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వం వహించారు. ద్విజాతి సిద్ధాంతం భారతదేశం, పాకిస్థాన్ పంచుకునే సాధారణ చరిత్ర, వారసత్వ భావనకు విరుద్ధంగా ఉంది, అలాగే లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉంది.
తన అభిప్రాయాన్ని నొక్కిచెబుతూ జనరల్ మునీర్ భారతదేశం, పాకిస్థాన్ రెండు దేశాలని అన్నారు. "మనం ఒకే దేశం కాదు. అందుకే మన పూర్వీకులు ఈ దేశాన్ని సృష్టించడానికి కష్టపడ్డారు. మన పూర్వీకులు, మనం ఈ దేశ సృష్టి కోసం చాలా త్యాగాలు చేశాం. దానిని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుసు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, కుమారులు కుమార్తెలారా, దయచేసి ఈ పాకిస్థాన్ కథను మర్చిపోకండి. ఈ కథను మీ తదుపరి తరానికి చెప్పడం మర్చిపోకండి, తద్వారా పాకిస్థాన్‌తో వారి బంధం ఎప్పుడూ బలహీనపడదు" అని ఆయన అన్నారు.
మతపరమైన కార్యకలాపాల కారణంగా పాకిస్థాన్‌కు పెట్టుబడులు రావని చాలా మంది భయపడుతున్నారని జనరల్ మునీర్ అన్నారు. "దేశ భవిష్యత్ ను ఉగ్రవాదులు నాశనం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ సాయుధ దళాలను అణచివేయగలరని మీరు అనుకుంటున్నారా?" అని ఆయన అన్నారు.
కశ్మీర్ గురించి మాట్లాడుతూ జనరల్ మునీర్ ఇలా అన్నారు, "మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది, అది మా జీవనాడి, దానిని మర్చిపోము. మా కశ్మీరీ సోదరులను వారి వీరోచిత పోరాటంలో ఒంటరిగా వదిలిపెట్టము" అన్నారు.
బలూచిస్థాన్‌లోని వేర్పాటువాద ఉద్యమాలపై సాయుధ దళాలు కఠినంగా చర్యలు తీసుకుంటాయని పాకిస్థాన్ సైన్యాధిపతి స్పష్టం చేశారు. "బలూచిస్థాన్ పాకిస్థాన్ గర్వకారణం, మీరు దానిని అంత తేలిగ్గా తీసుకుంటారా? మీరు దానిని 10 తరాలలో తీసుకోలేరు. ఇన్షా అల్లాహ్, మేము ఈ ఉగ్రవాదులను త్వరలోనే ఓడిస్తాము. పాకిస్థాన్ పతనం కాదు" అని పాక్ సైన్యాధిపతి అన్నారు.