Waqf Act Amendments 2025 : పార్లమెంటు ఆమోదించి, రాష్ట్రపతి సంతకంతో అమలులోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశంలోని ముస్లిం సామాజికవర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అలాగే కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కొందరు ఆశ్రయించారు. ఇలా దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపడుతోంది.
వక్ఫ్ సవరణ చట్టం 2025పై దాఖలైన దాదాపు 100 పిటిషన్లపై ఏకకాలంలో విచారణ జరుపుతోంది సుప్రీం కోర్టు. బుధవారం ప్రారంభమైన విచారణ ఇవాళ(గురువారం) కూడా కొనసాగింది. రెండో రోజు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి సమాధానం కోరుతూ తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని... కొత్త నియామకాలు, భూముల రద్దు వంటివి చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ మే 5న జరగనుంది.
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ: 10 కీలక అంశాలు
- కొత్త నియామకాలు లేవు: తదుపరి విచారణ వరకు వక్ఫ్ బోర్డుల్లో కొత్త నియామకాలు చేపట్టబోమని, ఆస్తుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
- ‘వక్ఫ్ బై యూజర్’ యధాతథం: డాక్యుమెంట్లు లేకుండా మతపరమైన లేదా ఛారిటీ ఉపయోగం ఆధారంగా వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులపై ఎలాంటి మార్పులు ఉండవు. అన్ని ‘వక్ఫ్ బై యూజర్’లు తప్పని చెప్పడం లేదని, కానీ ఆందోళనలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
- ముస్లిమేతర సభ్యుల నియామకాలపై స్టే: సవరించిన వక్ఫ్ చట్టంలో తొలిసారిగా ముస్లిమేతర సభ్యులను బోర్డులో చేర్చేందుకు వీలు కల్పించినప్పటికీ, దానిపై ప్రస్తుతానికి స్టే విధించారు.
- సెక్షన్ 9, 14పై కోర్టు ఆగ్రహం: ఈ సెక్షన్ల ప్రకారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో కేవలం 8 మంది ముస్లింలు, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కేవలం 4 మంది ముస్లిం సభ్యులను మాత్రమే పరిమితం చేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 22, 11గా ఉంది.
- సిజెఐ ప్రశ్న: హిందూ ట్రస్ట్ బోర్డుల్లో ముస్లింలను చేరుస్తారా? అని సీజేఐ సంజీవ్ ఖన్నా సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించారు.
- 5 పిటిషన్లపైనే విచారణ: 100కు పైగా దాఖలైన పిటిషన్లలో 5 పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతామని, మిగిలినవి పరిష్కరించినట్లుగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- కేంద్రానికి వారం గడువు: సమాధానం దాఖలు చేసేందుకు కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత పిటిషనర్లకు 5 రోజుల గడువు ఇస్తారు.
- హక్కులపై చర్చ: కొత్త వక్ఫ్ చట్టం సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదిస్తున్నారు.
- రాజకీయాలు వేడెక్కాయి: కాంగ్రెస్, ఆప్, డీఎంకే, సీపీఐ, జేడీయూ వంటి పార్టీలు ఈ చట్టాన్ని సవాలు చేశాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ వైఖరి కీలకం.
- దేశవ్యాప్తంగా నిరసనలు, హింస: వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బెంగాల్‌లో ముగ్గురు మరణించడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం దీన్ని అమలు చేయబోమని ప్రకటించింది.