టీచ‌ర్ కొట్ట‌డంతో ద‌ళిత విద్యార్థి మృతి.. పోలీసుల కారుకు నిప్పుపెట్టి, రాళ్లు రువ్విన బంధువులు

By team teluguFirst Published Sep 27, 2022, 11:40 AM IST
Highlights

దళిత స్టూడెంట్ ను ఓ టీచర్ కొట్టడంతో ఆ బాలుడు చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెల‌రేగాయి. 10వ తరగతి చదువుతున్న ఓ దళిత విద్యార్థిని స్కూల్ లో టీచర్ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కుటుంబ స‌భ్యులు, బంధువులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ఇవి హింసాత్మ‌కంగా మారాయి. 

వివ‌రాలు ఇలా ఉన్నాయి. బెసౌలిలోని ఔరయ్య అచల్దా పోలీస్ స్టేషన్ లో నివాసం ఉంటున్న రాజు దోహ్రా కుమారుడు నిఖిల్ దోహ్రా స్థానిక పాఠ‌శాల‌లో పదో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్ లో అశ్వ‌నీ సింగ్ అనే వ్య‌క్తి టీచ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఆ టీచ‌ర్ సోష‌ల్ ప‌రీక్ష‌లో స్పెల్లింగ్స్ త‌ప్పు రాశాడ‌ని నిఖిల్ ను చిత‌క‌బాదాడు. దీంతో ఆ బాలుడి ఆరోగ్యం క్షీణించింది. అనంత‌రం విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మహిళా కానిస్టేబుల్ మీద హత్యాయత్నం, న్యాయవాది జంట అరెస్ట్...

అయితే ఆ బాలుడి ప‌రిస్థితి విష‌మించ‌డంతో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. దీంతో కుటుంబ స‌భ్యుల‌కు ఆగ్ర‌హం వ‌చ్చింది. హాస్పిట‌ల్ సిబ్బంది బాలుడి మృత‌దేహానికి పోస్ట్ మార్టం నిర్వ‌హించి బంధువుల‌కు అప్ప‌గించారు. ఈ విష‌యం తెలుసుకున్న నిందితుడు పారిపోయాడు. 

ఆ టీచ‌ర్ ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తూ భీమ్ ఆర్మీ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియ‌లు నిర్వ‌హించ‌డానికి మొద‌ట నిరాక‌రించారు. నిఖిత్ చదివిన జిల్లాలోని అచల్దా ప్రాంతంలో పాఠశాల వెలుపల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కొంత స‌మ‌యం త‌రువాత ఈ నిర‌స‌న హింసాత్మ‌కంగా మారింది. నిర‌స‌న‌కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారి వాహ‌నానికి నిప్పంటించారు.

ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం, నిందితుడిని గదిలో పెట్టి తాళం వేసిన బాధితురాలు..

దీంతో సీనియర్ పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై త‌క్ష‌ణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాలుడి కుటుంబ స‌భ్యులు,  భీమ్ ఆర్మీ సభ్యులు శాంతించారు. నిఖిత్ మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంగీకరించారు.

చండీగఢ్ యూనివర్శిటీ ఎంఎంఎస్ కుంభకోణం : నిందితురాలితో ఆర్మీ జవాన్ డేటింగ్...

కాగా,.. ఈ ఘ‌ట‌న‌పై అచల్దా పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు నిందితుడిని ప‌ట్టుకునేందుకు బృందాల‌ను ఏర్పాటు చేశారు. గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

click me!