Corona Virus Update: దేశంలో కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూ 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,024కు పెరిగింది.
Covid-19 : ఆసియాలోని చైనా, దక్షిణ కొరియా సహా పలు యూరప్ దేశాల్లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. భారత్ లోనూ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రభావం పెరుగుతున్నదని ప్రస్తుతం నమోదవుతున్న కేసుల గణాంకాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరగడం.. కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌లను జన్యు శాస్త్రవేత్తలు వేగంగా గుర్తించడం కోవిడ్ మహమ్మారి ఇంకా ముగియలేదనడానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని వైద్య బృందాలు, అధికార యంత్రాంగాలు పేర్కొంటున్నాయి.
శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. భారత్ లో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ రోజురోజుకూ పెరుగుతోంది. రోజువారీ కరోనా వైరస్ కేసులు 4 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 3,805 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 4,30,98,743కి చేరుకుంది. యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల కాసేలోడ్ 20,303కు చేరుకుంది. ఇది మొత్తం కేసులలో 0.05 శాతంగా ఉంది. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో కోవిడ్ -19 సంక్రమణ కారణంగా 22 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,024కు పెరిగింది.
undefined
దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,25,54,416 కు చేరుకుంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను పెంచుతున్నామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత 24 గంటల్లో కోవిడ్-19ని గుర్తించేందుకు 4,87,544 పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా 84,03,32,469 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.78 శాతంగా నమోదైందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీక్లీ పాజిటివిటీ రేటు 0.79 శాతంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సైతం ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇప్పటివకు దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 190 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత్ కరోనా వైరస్ కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. మాస్కులను తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చాయి. కాగా, దేశంలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,024 గా ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. కానీ భారత్ లో కరోనా వైరస్ సోకి 4.7 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ రిపోర్టులను భారత్ ఖండించింది.