గుజరాత్‌ను దెబ్బతీయాలని చూశారు.. కానీ : ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 28, 2022, 7:33 PM IST
Highlights

గుజరాత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పెట్టుబడులు నిలిచిపోయేలా చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. కానీ ప్రజలు పట్టుదలతో శ్రమించి అభివృద్ధి చేసి చూపించారని ఆయన అన్నారు. 

గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆదివారం భుజ్ జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గుజరాత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పెట్టుబడులు నిలిచిపోయేలా అడ్డుకునేందుకు కుట్రలు జరిగినట్లు ఆయన ఆరోపించారు. కానీ ఆ యత్నాలేవీ ఫలించలేదని మోడీ అన్నారు. 2001లో వచ్చిన భూకంపం సమయంలో తాను కచ్ పునర్నిర్మాణం గురించి పనిచేశానని.. ఇప్పుడు ఆ ఫలితాలను చూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. నాటి భూకంప పరిస్ధితిని చూసి.. కచ్ ఇక ఎన్నటికీ కోలుకోదని కొందరు అన్నారని, కానీ జనం అభివృద్ధి చేసి చూపించారని మోడీ గుర్తుచేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. 

అంతకుముందు మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోడీ. అమృత్ మహోత్సవ్, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని సమిష్టి శక్తిని అంద‌రం చూశామ‌ని చెప్పారు. ‘‘ ఇంత పెద్ద దేశం, ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి, కానీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు అందరూ ఒకే స్ఫూర్తితో నిలిచారు. ఆగస్టులో మీ లేఖలు, సందేశాలు, కార్డులు నా కార్యాలయాన్ని త్రివర్ణ పతాక ఛాయల్లో ముంచెత్తాయి. త్రివర్ణ పతాకాన్ని మోయని లేదా త్రివర్ణ పతాకం, స్వేచ్ఛ గురించి మాట్లాడని ఏ ఉత్తరాన్ని నేను చూడలేదు’’ అని ఆయన అన్నారు. స్వచ్ఛత, టీకాల ప్రచారంలో దేశ స్ఫూర్తిని చూశామని, అమృత్ మహోత్సవ్‌లో మళ్లీ అదే దేశభక్తి స్ఫూర్తిని చూడబోతున్నామని ఆయన అన్నారు. ఈ వేడుకలు వచ్చే ఏడాది  ఆగ‌స్టు 2023 వరకు కొనసాగుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

Also Read:స్వాతంత్య్ర దినోత్స‌వం నాడు దేశం స‌మిష్టి శ‌క్తిని చూశాం - మ‌న్ కీ బాత్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

త్రివర్ణ పతాకం ప్రచారం కోసం ప్రజలు వివిధ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చారు. ఒక పజిల్ కళాకారుడు రికార్డ్ టైంలో మొజాయిక్ కళ ద్వారా అందమైన త్రివర్ణ పతాకాన్ని సృష్టించారు. అస్సాం ప్రభుత్వ ఉద్యోగులు 20 అడుగుల త్రివర్ణ పతాకాన్ని సృష్టించారు ’’ అని ఆయన తెలిపారు. అమృత్ మహోత్సవ్ రంగులు భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా కనిపించాయని ప్రధాని నొక్కి చెప్పారు. కాగా.. బోట్స్ వానాలోని నివసిస్తున్నస్థానిక గాయకులు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 దేశభక్తి గీతాలను ఆలపించారు.

click me!