త్వరలోనే కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా రాహుల్ గాంధీ: సీనియర్ నేత హరీశ్ రావత్ జోస్యం

By Mahesh KFirst Published Aug 28, 2022, 7:02 PM IST
Highlights

కాంగ్రెస్ పూర్తి కాల అధ్యక్షుడి ఎన్నిక కోసం సీడబ్ల్యూసీ షెడ్యూల్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవుతారని జోస్యం చెప్పారు. తనతోపాటు పార్టీ వర్కర్లు అంతా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని వివరించారు.
 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం డేట్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే పార్టీ సీనియర్ లీడర్ హరీశ్ రావత్ ఎన్నిక ఫలితంపై జోస్యం చెప్పారు. త్వరలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారని తెలిపారు. తాను, ఇతర కాంగ్రెస్ పార్టీ వర్కర్లు అంతా ఇదే నిజం కావాలని ఆశిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోస్టును స్వీకరించాలని తామంతా రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ సారథ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారీ దారుణంగా మట్టి కరిచింది. ఈ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎంత ఒత్తిడి చేసినా మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టలేదు. అప్పటి నుంచి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవడానికి సీడబ్ల్యూసీ ఓ ఎన్నిక తేదీని ప్రకటించింది.

సెప్టెంబర్ 22న అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 19న కౌంటింగ్ నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ అభ్యర్థులు నామినేషన్లు దాఖలైన సందర్భంలో మాత్రమే ఎన్నిక అనివార్యం కానుంది. నేడు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. పార్టీ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ సమేశంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు వర్చువల్‌గా పాల్గొన్నారు. 

ఇంకా ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, పి చిదంబరం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్, జీ-23 అసమ్మతి గ్రూపులో భాగమైన ఆనంద్ శర్మ.. తదితరులు పాల్గొన్నారు.

click me!