వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. రైతుల డిమాండ్లను తాము అంగీకరిస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. హేతుబద్ధమైన రైతుల డిమాండ్లు అన్నింటిని తాము అంగీకరిస్తామని, తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా కనీస మద్దతు ధర హామీని చేరుస్తామని వివరించారు.
MSP: రైతులు మరోసారి సుదీర్ఘ పోరాటానికి సిద్ధం అయ్యారు. పంటలకు చట్టబద్ధమైన హామీతో కనీస మద్దతు ధర ప్రకటించాలని, గతంలో చేపట్టిన ఆందోళనలో రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని, మరికొన్ని డిమాండ్లతో రైతులు ధర్నా చేస్తున్నారు. శంభూ సరిహద్దులో ఆందోళనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరుపుతున్నది. ఐదో సారి చర్చలకు తాము సిద్ధం అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వ రైతుల సహేతుకమైన డిమాండ్లు అన్నింటినీ అంగీకరిస్తుందని హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వివరించారు. కర్ణాటకలోని కాలబురగిలో బుధవారం మీడియాతో ఖర్గే మాట్లాడారు.
‘మేం రైతులకు మద్దతు ఇస్తున్నాం. వారి రీజనబుల్ డిమాండ్లను తప్పకుండా నెరవేర్చాలని మేం బహిరంగంగా చెబుతూనే ఉన్నాం. మా ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయాలను పొందుపరుస్తాం. కనీస మద్దతు ధరకు న్యాయబద్ధమైన హామీని కూడా ఇస్తాం. అయితే.. ఇందులో అన్ని పంటలు కవర్ కావు. ముఖ్యమైన పంటలకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తాం’ అని ఖర్గే వివరించారు.
Also Read: BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ
కాగా, రాహుల్ గాంధీ కూడా ఎక్స్‌లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రూ. 14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని, రూ. 1.8 లక్షల కోట్ల కార్పొరేట్ పన్నుల మినహాయింపులు చేశారని, అలాంటిది.. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తే.. వచ్చే నష్టమేమిటీ? అని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరను ప్రశ్నిస్తున్నవారు.. దాని చుట్టూ గందరగోళం తయారు చేస్తున్నవారంతా.. ఎంఎస్ స్వామినాథన్ కలలను తిరస్కరిస్తున్నవారిగానే చూడాలని ట్వీట్ చేశారు.