
హర్యానాలోని గురుగ్రామ్ లో మత ఉద్రిక్తత చోటు చేసుకుంది. నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంపై చెలరేగిన హింస దానికి పొరుగునే ఉన్న గురుగ్రామ్ కు వ్యాపించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. అల్లర్లను ఆపేందుకు ప్రయత్నించిన ఇద్దరు హోంగార్డులు సోమవారం మరణించగా.. తాజాగా మరో పౌరుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.
తాజా ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుగ్రామ్ లో సెక్టార్ 57 ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్దకు సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ గుంపు చేరుకుంది. అయితే ఆ సమయంలో కొందరు మసీదులో ఉన్నారు. దీంతో ఈ గుంపు వారిపై కాల్పులు జరిపారు. అనంతరం మసీదుకు నిప్పు పెట్టారు. దీంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వీరిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే అందులో ఒకరు పరిస్థితి విషమించి మరణించారు.
మృతుడిని బీహార్ కు చెందిన 26 ఏళ్ల సాద్ గా గుర్తించారు. నుహ్ నుంచి వ్యాపించిన మత ఉద్రిక్తతల్లో ఇది మూడో మరణం అని పోలీసు అధికారులు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన 'శోభా యాత్ర' ర్యాలీలో ప్రముఖ గోసంరక్షకుడు మోను మనేసర్ ఉన్నారనే సమాచారంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ ఊరేగింపును అడ్డుకునేందుకు ఓ వర్గానికి చెందిన గుంపు రాళ్లు రువ్వడం మొదలుపెట్టింది.
ఒడిశాలో దారుణం.. 14 ఏళ్ల బాలుడి నరబలి.. కాళ్లు, చేతులు నరికేసి, కళ్లను కూడా..
అయితే శాంతిభద్రతల పరిరక్షణ కోసం గురుగ్రామ్ నుంచి నుహ్‌కి వెళుతున్న పోలీసు బృందం వారి వాహనానికి కూడా దుండగులు నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఇద్దరు హోంగార్డులు తీవ్ర గాయాలతో మరణించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులతో సహా 15 మంది గాయపడ్డారు.
ప్రస్తుతం నుహ్, గురుగ్రామ్ లో పరిస్థితి ఉద్రిక్తతంగానే ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి సెక్షన్ 144 విధించబడింది. దీంతో మంగళవారం కొత్తగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. కాగా.. ఈ అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ‘‘నేటి ఘటన దురదృష్టకరం. రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము’’ అని ఆయన స్పష్టం చేశారు.