అరుణాచల్‌లో ఘర్షణలు.. సరిహద్దులో పరిస్థితులపై స్పందించిన చైనా.. ఏమన్నదంటే?

By Mahesh KFirst Published Dec 13, 2022, 3:08 PM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్, చైనా దేశాల సైన్యం మధ్య ఘర్షణలు జరిగాయి. భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించిన చైనా ఆర్మీని భారత జవాన్లు దీటుగా నిలువరించి వెనక్కి పంపారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 9వ తేదీన జరిగిన ఘర్షణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా, సరిహద్దు విషయమై చైనా కూడా రియాక్ట్ అయింది.
 

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌ తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత, చైనా సైన్యాల మధ్య ఈ నెల 9వ తేదీన ఘర్షణలు జరిగాయి. లడాఖ్‌లో గాల్వాన్ ఘటన తర్వాత మళ్లీ తవాంగ్ సెక్టార్‌లో ఈ ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై పార్లమెంటులో కేంద్ర మంత్రులు మాట్లాడారు. భారత భూభాగంలోకి చైనా పీఎల్ఏ జవాన్లు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారని, వారిని భారత సైనికులు దీటుగా అడ్డుకున్నారని తెలిపారు. సరైన జవాబు చెప్పి వెనక్కి పంపించారని చెప్పారు. ఈ ఘర్షణల్లో భారత సైనికుల్లో ఎవరూ గంభీరమైన గాయాలపాలేమీ కాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో తెలిపారు. భారత సైనికుల కంటే చైనా సైనికులే ఎక్కువ గాయపడ్డారని అధికారవర్గాలు తెలిపాయి.

9వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన నిన్న వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత మంగళవారం చైనా సరిహద్దులో పరిస్థితులపై స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో గతవారం ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్టు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో పేర్కొన్న తర్వాత చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ సరిహద్దు అంశంపై మాట్లాడారు.

‘మా వరకు చైనా, భారత్ సరిహద్దులో పరిస్థితులు మొత్తంగా సుస్థిరంగానే ఉన్నాయని భావిస్తున్నాం’ అని వెన్‌బిన్ అన్నారు. అంతేకాదు, సరిహద్దులో శాంతి కోసం ఉభయ దేశాలు దౌత్య, మిలిటరీ స్థాయిల్లో చర్చలు నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నామని వివరించారు.

Also Read: భారత్ - చైనాల మధ్య టెన్షన్..టెన్షన్.. అరుణాచ‌ల్ వ‌ద్ద ఫైట‌ర్ జెట్స్ పెట్రోలింగ్‌

తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణలపై వెన్‌బిన్ కామెంట్ చేయలేదు. కానీ, తమ అవగాహనలో మాత్రం చైనా, భారత సరిహద్దుల్లో పరిస్థితులు మొత్తంగా స్టేబుల్‌గానే ఉన్నాయని అన్నారు. ఇరు దేశాలు శాంతి చర్చలు నిరాటంకంగా కొనసాగిస్తున్నాయని, శాంతియుత వాతావరణం వైపు చైనా వేస్తున్న దిశగానే భారత్ కూడా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నట్టు వివరించారు.

కాగా, తవాంగ్ సెక్టార్‌లో ఘర్షణల గురించి చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ కామెంట్ కోసం ఏఎఫ్‌పీ చేసిన విజ్ఞప్తికి సమాధానం రానేలేదు.

2020లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి.

click me!