చంద్రయాన్ 3 ఎపిసోడ్ ముగిసినట్టే! రోవర్ నుంచి రాని సిగ్నల్

Google News Follow Us

సారాంశం

జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయి 14 రోజులపాటు చకచకా సుమారు 100 మీటర్లు ప్రయాణం చేసిన రోవర్ ఇప్పుడు సిగ్నల్స్ పంపించడం లేదు. ఇస్రో శాస్త్రవేత్తలు పలుమార్లు ప్రయత్నాలు చేస్తున్నా.. అక్కడి నుంచి సంకేతాలేవీ రావడం లేదు. దీంతో చంద్రయాన్ 3 రోవర్, ల్యాండర్ జాబిల్లిపైనే శాశ్వత నిద్రలోకి వెళ్లినట్టుగా భావిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ విజయధ్వానం ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. అతి తక్కువ బడ్జెట్‌లోనే ప్రపంచంలోనే తొలిసారి చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో రోవర్‌ను సేఫ్‌గా ల్యాండ్ చేసిన ఘనతను మన దేశానికి ఇస్రో తెచ్చి పెట్టింది. ముందస్తుగా అనుకున్నట్టే చంద్రుడిపై 14 రోజులపాటు రోవర్ పని చేసింది. ల్యాండ్ అయిన స్పాట్ నుంచి సుమారు 100 మీటర్లు రోవర్ ప్రయాణించి సల్ఫర్, ఐరన్, ఆక్సిజన్, ఇతర మూలకాలు ఉన్నట్టు కనుగొంది. భూమిపై 14 రోజుల కాలం గడిచిన తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంపై సూర్యాస్తమయం అయినప్పుడు రోవర్, ల్యాండర్ నిద్రాణ స్థితిలోకి వెళ్లాయి.

మళ్లీ సూర్యోదయం తర్వాత వాటిని యాక్టివ్ చేసే ప్రయత్నాలను ఇస్రో చేసింది. రియాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో రోవర్ సోలార్ ప్లేట్‌లను కిరణాలు పడే రీతిలో అమర్చి సెప్టెంబర్ 2వ తేదీన స్లీప్ మోడ్‌లోకి పంపించారు. మళ్లీ యాక్టివ్ అవుతుందనే గంపెడు ఆశలతో ఇస్రో ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ, దురదృష్టవశాత్తు ప్రజ్ఞాన్ రోవర్, ల్యాండర్ యాక్టివ్ కాలేదు. ఇక్కడి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా అక్కడి నుంచి మాత్రం సిగ్నల్స్ రాలేవు.

Also Read: ఏషియానెట్ న్యూస్ పాడ్ కాస్ట్: చంద్రుడి మీద కాలుమోపాల్సిందే అంటున్న ISRO చైర్మన్ సోమనాథ్ తో

అక్కడ సెప్టెంబర్ 30వ తేదీన మళ్లీ సూర్యాస్తమయం అవుతున్నది. ఈ సూర్యాస్తమయం వరకు రోవర్‌ను మేల్కొలిపే ప్రయత్నాలను ఇస్రో కొనసాగిస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇప్పటి వరకు తమ ప్రయత్నాలు ఫలించలేదని, అక్కడి నుంచి సంకేతాలేవీ రాలేవని తెలిపాయి. చంద్రుడిపై సుదీర్ఘమైన రాత్రిలో కఠినమైన శీతోష్ణస్థితిని తట్టుకుని రోవర్ మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చే అవకాశాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు విశ్వాసం ఎక్కువగా ఉంది. అయితే.. ఇప్పటి వరకైతే సిగ్నల్స్ లేని కారణంగా చంద్రయాన్ 3 ఎపిసోడ్ ముగిసినట్టేనని చెబుతున్నారు. అయితే.. చంద్రయాన్ 3 నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే ఛేదించిందనే విషయం తెలిసిందే.

శ్రీహరికోటలో షార్ నుంచి చంద్రయాన్ 3 మిషన్‌ను ఆగస్టు 23న ప్రయోగించగా స్పేస్‌లో 40 రోజులు ప్రయాణించి సెప్టెంబర్ 21వ తేదీన రోవర్ జాబిల్లిపై సురక్షితంగా దిగిపోయింది.