ఒకరు దోపిడిదారు.. మరొకరు దొంగ - అన్నాడీఎంకే-బీజేపీ చీలిక పై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్..

తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ బీజేపీ, అన్నాడీఎంకేపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ నుంచి విడిపోవాలనుకున్న అన్నాడీఎంకే నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. ఇలా జరగడం రెండు పార్టీలకు కొత్తేమీ కాదని అన్నారు. ఎన్నికల్లో పోరాడినట్టు నటించి, ఎన్నికల అనంతరం కలిసిపోతాయని విమర్శించారు.


బీజేపీతో పసంబంధాలు తెంచుకోవాలని తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. రెండు పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. ఒకరు దోపిడిదారు అయితే, మరొకరు దొంగ అని అభివర్ణించారు. కాబట్టి రెండు పార్టీలు కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. బీజేపీతో అన్నాడీఎంకే సంబంధాలు తెంచుకున్నప్పటికీ 2024 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కృష్ణగిరి జిల్లాలో జరిగిన డీఎంకే యువజన విభాగం బహిరంగ సభలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ముగిసిందని కేపీ మునుస్వామి ప్రకటించారు. మీరు (అన్నాడీఎంకే) బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా గెలిచేది డీఎంకేనే. ప్రజలను మోసం చేయలేరు. దీనిని సొంత అన్నాడీఎంకే శ్రేణులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు ? ఎందుకంటే మీ మాజీ ముఖ్యమంత్రి, మంత్రులపై ఈడీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.’’ అని అన్నారు. 

Latest Videos

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. గతంలో కూడా అన్నాడీఎంకే, బీజేపీ ఒకరిపై ఒకరి పోరాడినట్టు నటించారని, కానీ తరువాత మళ్లీ ఒక్కటవుతాని చెప్పారు. ఎందుకంటే ఒకరు దోపిదారు అయితే, మరొకరు దొంగ అని విమర్శించారు. ఈ సందర్భంగా రెండు పార్టీలను ఆయన దుయ్యబట్టారు. 

ఇదిలా ఉండగా.. సోమవారం తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిగిన అనంతరం బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో  సంబంధాలు తెంచుకున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై దూకుడు రాజకీయాల వల్ల తలెత్తిన వాస్తవ పరిస్థితులను అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వివరించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. 

ద్రవిడ ఐకాన్ సీఎన్ అన్నాదురై గురించి వ్యాఖ్యానించినందుకు అన్నామలై క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పకపోతే ఆయనను మార్చాలని అన్నాడీఎంకే నాయకులు డిమాండ్ చేశారు.  కాగా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే 2024 లోక్ సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తుందని ప్రకటించింది.

అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడానికి అన్నామలై నిరాకరించారు. తమ పార్టీకి, అన్నాడీఎంకేకు మధ్య ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అన్నాదురై గురించి తాను చెడుగా మాట్లాడలేదని, 1956లో జరిగిన ఒక సంఘటనను మాత్రమే చెప్పానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్డీయే నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అన్నాడీఎంకేను పార్టీ కోరబోదని, అన్నామలైకి గట్టిగా మద్దతిస్తున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. 2019 లోక్ సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

click me!