
న్యూఢిల్లీ: రిటైర్డ్ దౌత్యాధికారి దీపక్ వోహ్రా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్‌లో నిర్వహించిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి జస్టిన్ ట్రూడో ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయన ఫ్లైట్ నిండా కొకైన్ ఉన్నట్టు ఆరోపించారు. అంతేకాదు, జీ 20 కార్యక్రమాలకూ బంక్ కొట్టి రెండు రోజులు గదిలో నుంచి బయటకు రాలేదని ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
మన దేశ స్నిఫర్ డాగ్‌లు ట్రూడో ప్లేన్‌లో కొకైన్ ఉన్నట్టు గుర్తించాయని దీపక్ వోహ్రా వివరించారు. ట్రూడో ప్రవర్తన కూడా భిన్నంగా ఉన్నదని, హుందాగా వ్యవహరించలేదని తెలిపారు. జస్టిన్ ట్రూడో తనకు తాను కెనడియన్ ర్యాంబోగా చిత్రించుకోవాలని అనుకున్నాడని ఆరోపించారు.
ఇంటర్వ్యూలో దీపక్ వోహ్రా ఇంకా మాట్లాడుతూ.. ట్రూడోకు అసలు మెదడు ఉన్నదా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఒక చిన్న పిల్లవాడు అని కామెంట్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు కూడా ట్రూడో సరిగా లేడని ఆయన భార్య కూడా గమనించిందని ప్రస్తావించారు.
వోహ్రా చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలను న్యూస్ చానెల్ వ్యాఖ్యాత దీపక్ చౌరాసియా కనీసం ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరచలేదు. ఆయన వ్యాఖ్యలకు సింపుల్‌గా సరే అంటూ మరో టాపిక్‌లోకి వెళ్లారు.
గతంలోనూ దీపక్ వోహ్రా ఇలాంటి సంచలనమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను పింగ్ పాంగ్ టింగ్ లింగ్ టింగ్ లింగ్ అని జాతీయ టెలివిజన్‌లో కామెంట్ చేయడం సంచలనమైంది.
Also Read: Delimitation: దక్షిణాది వాణి అణచాలని చూస్తే బలమైన ప్రజా ఉద్యమం తప్పదు: కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
2007 నుంచి 2009 కాలంలో సూడాన్ దేశానికి అంబాసిడర్ గా దీపక్ వోహ్రా పని చేసినప్పుడు ఫైనాన్షియల్ బంగ్లింగ్ కు సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలను సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఇంతా ఉన్నా భారత దేశ అంతర్జాతీయ సంబంధాల గురించి పలు న్యూస్ చానెళ్లు ఆయనను ఆహ్వానించి ప్రశ్నలు వేస్తుంటాయి.