చంద్రబాబు చారిత్రక విజయం... పవన్‌ అంటే తుఫాన్‌... ప్రశంసలతో ముంచెత్తిన మోదీ

By Galam Venkata Rao  |  First Published Jun 7, 2024, 2:16 PM IST

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించారని ప్రధాని మోదీ వారిని ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు చారిత్రక విజయం సాధించారని... పవన్ అంటే తుఫాన్ అని కొనియాడారు.  


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీయే విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపమని అభివర్ణించారు. చంద్రబాబు చారిత్రక విజయం సాధించారని... ఇందుకు పవన్ కల్యాణ్‌ తోడ్పడ్డారని ప్రశంసించారు. పవన్‌ అంటే పవన్‌ కాదని.. ఓ తుఫాను అంటూ జనసేనానిని ఆకాశానికెత్తారు. ఆంధ్రాలో ప్రజలు పట్టుబట్టి ఎన్‌డీయేని గెలిపించారని... ఇంతటి భారీ విజయం పవన్‌ కల్యాణ్‌ వల్లే సాధ్యమైందన్నారు. 

ఈ సందర్భంగా విపక్షంలో గెలిచిన వారికి అభినందనలు తెలిపారు. ఓడిపోయిన వారిని అవమానించే సంస్కృతి తమది కాదన్నారు. పదేళ్ల తర్వాత కూడా విపక్షానికి వంద సీట్లు రాలేదని ఎద్దేవా చేశారు.  అలాగే, ఇండి కూటమిపై మోదీ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో తప్పుడు హామీలిస్తే సరిపోదన్నారు. విపక్ష కూటమి ఇండియాగా పేరు మార్చుకున్నంత మాత్రాన వాటి కుంభకోణాలను దేశం మరిచిపోలేదని పునరుద్ఘాటించారు. లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ హామీలిచ్చిందని... ఇప్పుడు జనం ఆఫీసులు ముందు  నిలబడి అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజలను అవమానించడమేనన్నారు. ఇలాంటి కాంగ్రెస్‌ను దేశం క్షమించబోదని హెచ్చరించారు. తమిళనాడులో ఎన్‌డీయేకి సీట్లు రాకపోయినా.. మున్ముందు ఏం జరుగుతుందో అందరూ చూస్తామన్నారు. ఎన్డీయే విజయానికి కార్యకర్తలే కారణమని మోదీ పేర్కొన్నారు. 

Latest Videos

undefined

30 ఏళ్లుగా ఎన్‌డీయే కూటమి నడుస్తోందన్న మోదీ... మూడు దశాబ్దాలు ఒక కూటమి కొనసాగడం మామూలు విషయం కాదన్నారు. సుపరిపాలనకు నిర్వచనం ఎన్‌డీయే కూటమి అని... ప్రజల కలలు సాకారం చేయడానికి కలిసి ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు.

ఢిల్లీలో శుక్రవారం నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, మిత్రపక్ష నేతలు పాల్గొన్నారు. 240 మంది బీజేపీ, మిత్రపక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. మూడోసారి ఎన్‌డీయే నేతగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

 

 

మూడోసారి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాన స్వీకారం చేయబోతున్నారు. 
 

click me!